న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష 'నీట్ -యుజి' ని వచ్చే ఏడాది నిర్వహించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ శుక్రవారం ప్రకటించింది. మే నెల ఏడో తేదీన నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రెండవ సెషన్ కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి)పరీక్షని మే 21 నుండి 31 వరకు జరగవచ్చని పేర్కొంది. అన్ని కీలక పరీక్షల షెడ్యూల్‌ను ఈ ఏడాది ముందుగానే ప్రకటించామని ఎన్‌టిఎ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 'జెఇఇ మెయిన్' వచ్చే ఏడాది జనవరి 24 నుండి 31 వరకు నిర్వహించబడుతుందని గురువారం ఎన్‌టిఎ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున పరీక్ష ఉండదని తెలిపింది. పరీక్ష రెండవ సెషన్ ఏప్రిల్‌లో నిర్వహించబడుతుంది. పరీక్షల కోసం డిసెంబర్ 15 నుండి జనవరి 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.










