Jun 13,2023 22:27

ఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్‌ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకులో మెరిసి సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ 99.99 పర్సంటైల్‌ సాధించి తొలి ర్యాంకు సాధించినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. నీట్‌ కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది నీట్‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. వివరాలు వెల్లడించినప్పటికీ ఫలితాలకు సంబంధించిన లింక్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌టిఎ ఇంకా అందుబాటులో ఉంచలేదు.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌ 4న ప్రిలిమినరీ ఆన్షర్‌ కీని విడుదల చేసిన ఎన్‌టిఎ .. దీనిపై జూన్‌ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టిఎ అధికారులు తాజాగా తుది ఆన్సర్‌ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.