జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రికి సిపిఎం ఎంపి లేఖ
న్యూఢిల్లీ : కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (పిజి) 2022లో కేరళలో కన్నూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పరీక్షా కేంద్రాలు కేటాయించడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సిపిఎంకు చెందిన రాజ్యసభ సభ్యులు వి. శివదాసన్ లేఖ రాసారు. 'కన్నూర్ జిల్లాలోని సియుఇటి (పిజి)-2022 అభ్యర్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పరీక్షా కేంద్రంగా కన్నూర్‌ను ఎంపిక చేసినా తమ పరీక్షా కేంద్రాన్ని కాన్పూర్‌లో కేటాయించారని అనేకమంది విద్యార్థులు నాకు తెలిపారు' అని లేఖలో ఎంపి తెలిపారు. ఈ పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కానున్నాయి, ఇంత తక్కువ వ్యవధిలో కన్నూర్ నుంచి కాన్పూర్‌కు విద్యార్థులు ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యమని లేఖలో తెలిపారు. ఈ విషయాన్ని అత్యవసర అంశంగా పరిగణించాలని, పరీక్షలకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని శివదాసన్ లేఖలో అభ్యర్థించారు.










