Oct 13,2023 15:42

ప్రజాశక్తి-విజయవాడ : మతోన్మాద బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి, లౌకికవాద ఇండియా పక్షానికి సమదూరంలో ఉంటామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన ప్రకటన అర్థరహితమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అమిత్‌షా మాటలు నమ్మి బిజెపి వలలో పడితే తెలుగుదేశం నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. తనను కలసిన మీడియా వారితో మాట్లాడుతూ ఇండియా కూటమిలో చేరుతారా లేదా అనేది తెలుగుదేశం పార్టీ ఇష్టమని, కానీ సమదూరం పేరుతో మతోన్మాద బిజెపికి సానుకూలంగా వ్యవహరించడం ప్రమాదకరమని చెప్పారు. మతోన్మాదానికి, లౌకికవాదానికి సమదూరం పాటించటమంటే మతోన్మాదానికి మేలు చేయడమేనని, రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని విస్మరించడం అన్యాయమని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేదని చెబుతున్న బిజెపి అధినాయకత్వం ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నదో చెప్పాలన్నారు. దాన్ని టిడిపి శ్రేణులచేత నమ్మించాలని చూడడం మోసకారితనం అవుతుందని అన్నారు. బిజెపి మతోన్మాదం, రాష్ట్రానికి చేసిన విద్రోహంపై టిడిపి శ్రేణులను తప్పుదారి పట్టించవద్దని తెలుగుదేశం నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మతోన్మాద బిజెపిని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని కోరారు.