న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే సందర్భంగా దొరికిన చారిత్రక వస్తువులను భద్రపరచాలని వారణాసి జిల్లా కోర్టు భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ)ని ఆదేశించింది. భద్రపరిచిన వస్తువులను జిల్లా మెజిస్ట్రేట్‌కు సమర్పించాలని తెలిపింది. మసీదు ప్రాంగణాన్ని రిజర్వ్ చేయడంతో పాటు, ఎఎస్‌ఐ సర్వే సమయంలో సేకరించిన చారిత్రక సాక్ష్యాలను భద్రపరిచేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని హిందూ కమ్యూనిటీ కోర్టును కోరింది. అయితే సర్వే కోసం మసీదు ప్రాంగణంలో యంత్రాలు, ఇతర సామగ్రిని వినియోగించకూడదని ముస్లిం కమ్యూనిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జ్ఞానవాపి మసీదులో ఎఎస్‌ఐ సర్వే చేపట్టేందుకు ఆగస్టులో అలహాబాద్ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. సర్వేను పూర్తి చేసేందుకు ఎఎస్‌ఐకి మరో నాలుగు వారాల అదనపు సమయాన్ని కోర్టు గతవారం మంజూరు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 6లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.










