ప్రజాశక్తి-విజయవాడ : నేటి సమాజంలో జరుగుతున్న నేరాలు- ఘోరాలకు సంబంధించిన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్గి, వాటిని పటిష్టంగా అమలు చేసినప్పుడే నేరస్తుడికి శిక్ష పడటంతో పాటు బాధితులకు న్యాయం జరుగుతుందని నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా అన్నారు. నేర- న్యాయ వ్యవస్థలోని ''చట్టాలపై అవగాహన-చర్చా'' కార్యక్రమం స్థానిక హౌటల్ లెమన్ ట్రీ ప్రీమియర్‌లో శనివారం జరిగింది. దీనికి పలువురు పోలీసు అధికారులు, ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్న ఈ సమావేశంనుద్దేశించి నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ... నేర-న్యాయ వ్యవస్థ నేరస్తులను శిక్షించడానికి, ప్రజల హక్కులు, వారి స్వేచ్చను పరిరక్షించడానికి సహాయ పడుతుందని అన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన చట్టాల్లోని మహిళా చట్టాలు, సైబర్ క్రైమ్, చిట్స్‌పండ్స్, అండ్ డిపాజిటరీ చట్టాలు, అరెస్ట్‌లు (41-ఎ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) తదితర అంశాలపై పోలీసులు, న్యాయవాదుల పాత్రపై క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సదరు చట్టాలను నిష్పక్షపాతంగా, పట్టిష్టంగా అమలు చేస్తేనే నేరస్తుడికి శిక్ష పడటమే గాక, బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర అడిషనల్ డ్రైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు, ది బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెబి సుందర్, ప్రముఖ న్యాయవాదులు దిట్టకవి రామచంద్, బండ్ల సాంబశివరావు, పోలీసు అధికారులు వెస్ట్ ఎసిపి కె హనుమంతరావు, దిశా ఎసిపి వివి నాయుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితర అంశాలపై అవగాహన కల్పించి, న్యాయవాదులు అడిగిన పలు పలు సందేహాలను నివృత్తి చేశారు. ఇటీవల కొత్తగా ఎన్నికయిన బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులను నగర పోలీసు కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి (రూరల్) అజిత వేజెండ్ల , ప్రముఖ న్యాయవాదులైన దిట్టకవి రామచంద్, బండ్ల సాంబశివరావు, సోము కష్ణమూర్తి, చోడిశెట్టి మన్మధరావు, పోలీస్ ఉన్నతధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.










