ప్రజాశక్తి-పెనుకొండ సిఎం జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నాయకులు వాపోయారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అనపర్తి సభకు పోలీసులు అనుమతి ఇచ్చి మళ్లీ రద్దు చేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వెంకటరాముడు, పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి హుజూర్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామలింగ, జిల్లా ఆఫీసు సెక్రటరీ సాయి ప్రసాద్, ముస్లిం మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు రియాజ్, ఉపాధ్యక్షుడు వాజిద్, పట్టణ ప్రధాన కార్యదర్శి వలీపీర్, జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి షౌకత్, ముస్లిం మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటనలకు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేకే తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు అడ్డంకులు సృష్టించారని టిడిపి నాయకులు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు సభను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం స్థానిక కళాజ్యోతి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై పోలీసుల ద్వారా విధిస్తున్న నిర్బంధాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి సభకు పోలీసులు అనుమతి మంజూరు చేసి.. రద్దు చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వైసిపి తుగ్లక్ చర్యలను మానుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ పాదయాత్ర చేసేటప్పుడు చంద్రబాబు కనుసైగ చేసి ఉంటే ఒక్క అడుగు ముందుకేసేవారా.. అని ప్రశ్నించారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని,ఏకపక్షంగా వ్యవహరించిన కొంతమంది అధికారులపై జ్యుడీషియల్ విచారించి చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పురుషోత్తంగౌడ్, పోతుకుంట లక్ష్మన్న, కోదుకుంట రమేష్, క్రిష్ణాపురం జమీర్ అహమ్మద్, పఠాన్ బాబూఖాన్, వరదరాజులు, గోసల శ్రీరాములు, మారుతిస్వామి, షామీర్, చీమలరామాంజి, చీమల నాగరాజు, బీరే శీనా, బిల్లే శీనా, కేతినేని రాజ, తొగట నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేస్తున్న టిడిపి నాయకులు










