Feb 18,2023 21:00

విలేకరులతో మాట్లాడుతున్న టిడిపి నాయకురాలు సవితమ్మ

            పెనుకొండ : ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం చాలా దారుణమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ అన్నారు. శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు జగన్‌ ప్రతిపక్షంలో చేపట్టిన పాదయాత్ర ముందుకు సాగేదా.. అని ప్రశ్నించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎపిలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కు లేదా.. ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ యాత్రలకు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్‌ భయపడిపోతున్నారన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ స్పందించి ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఇవ్వడంతోపాటు యాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు మాధవ నాయుడు, గుట్టూరు మాజీ సర్పంచి సూర్యనారాయణ, గయప్ప, మాజీ మండల కన్వీనర్‌ శ్రీరాములు ,త్రివేంద్ర నాయుడు, దాదు మంజు ,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.