- రెండు నెలలుగా నిలిచిన సరఫరా
- ప్రజాశక్తి కథనంతో సంస్థలో కదలిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులకు పంచదార సరఫరా రెండు నెలలుగా నిలిచిపోయింది. గత రెండు నుండి ఆరు నెలలుగా పౌరసరఫరాల సంస్థ పంచదార సప్లయర్స్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద సుమారు రూ.150 కోట్లు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు సంస్థలు పంచదార సప్లై చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చోడవరం కోపరేటివ్ షుగర్స్ లిమిటెడ్, విజయనగరం, కృష్ణా, అనంతపూర్ జిల్లాలకు శ్రీ సూర్యకుమారి ఏజెన్సీస్, తూర్పుగోదావరికి సురేష్‌చంద్ర రాజేంద్రకుమార్, పశ్చిమగోదావరికి శ్రీ వీరనారాయణ ట్రేడర్స్ కర్నాటక, గుంటూరుజిల్లాకు సుక్‌డన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హర్యానా, ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు హరికృష్ణా అండ్ కంపెనీ హైదరాబాద్, కడప,కర్నూలు జిల్లాలకు హెచ్‌ఎసిఎ హైదరాబాద్ కంపెనీలు పంచదారను సరఫరా చేస్తున్నాయి. పౌరసరఫరాల సంస్థ నుండి సదరు కంపెనీలకు 6 నుండి 2 నెలలు పెండింగ్ పెట్టడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, వడ్డీల భారం పెరగడంతో సరఫరా చేయలేని పరిస్థితుల్లో జిల్లాలకు పంచదార సరఫరా నిలిపేశామని సప్లయర్స్ చెబుతున్నారు. గతంలో పంచదార సప్లై చేయగానే సంస్థకు బిల్లులు ఆన్‌లైన్‌లో పెట్టేవాళ్లు. పౌరసరఫరాల సంస్థ అధికారులు 50శాతం బిల్లును వారం నుండి పదిరోజుల్లో చెల్లించేవారు. ఇప్పుడు 6నెలలు గడిచినా బిల్లులు వేయడంలేదు. వడ్డీకి అప్పులు తెచ్చి సరఫరా చేసినా బిల్లులు పడకపోవడంతో రాష్ట్రం మొత్తం సప్లయర్స్ అంతా ఒకేసారి పంచదారను నిలిపేశారు. దీంతో రేషన్ షాపుల్లో పంచదార లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజాశక్తి ఈనెల 9న ''చిక్కిపోతున్న రేషన్ చక్కెర'' అనే శీర్షికతో ఓ కథనం వెలువరించింది. దీనిపై పౌరసరఫరాల సంస్థ అప్రమత్తమైంది. పంచదార సరఫరా నిలిచిపోవడం, దానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. సప్లయర్స్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లింపులపై పౌరసరఫరాల సంస్థ ఎమ్‌డి జి వీరపాండ్యన్ అధికారులతో సమీక్ష నిర్వహించి, వాటిని క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత పంచదార ప్రొక్యూర్‌మెంట్ అధికారులు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే పనిలో నిమగమై ఉన్నారు. సప్లయర్స్‌తో ఎమ్‌డి వీరపాండ్యన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి జనవరి,ఫిబ్రవరి టెండర్లపై మాట్లాడుతున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో కేజీ పంచదార సరఫరాకు సప్లయర్స్ రూ.43 అడుగుతున్నారు. ప్రస్తుతం రూ.41.50కు పంచదార సరఫరా చేస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరలు, విద్యుత్ బిల్లుల నేపథ్యంలో ప్యాకింగ్,రవాణా నేపథ్యంలో రూ.43 చెల్లించాలని సప్లయర్స్ అడుగుతున్నారు. మరోసారి సప్లయర్స్‌తో పౌరసరఫరాల సంస్థ ఎమ్‌డి సమావేశం నిర్వహించి ఫైనల్ రేటు నిర్ణయించే అవకాశం ఉంది.
చెల్లింపులు చేయగానే సరఫరా చేస్తాం : పంచదార సప్లయర్
''నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో ఆర్థికంగా సతమతమవుతున్నాం. ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. అప్పులు చేసి రెండు నెలలు సరఫరా చేసినా, బిల్లులు రాలేదు. చేసేది లేక పంచదార సరఫరా నిలిపేశాం. పౌరసరఫరాల సంస్థ బిల్లులు చెల్లించగానే 3 నుండి 4రోజుల్లో సరఫరా పూర్తిచేయడానికి సిద్దంగా ఉన్నాం''
జనవరి నుండి పంచదార సమస్యలుండవు : జి వీరపాండ్యన్, పౌరసరఫరాల సంస్థ ఎమ్‌డి
''జనవరి నుండి రేషన్ షాపుల్లో కార్డుదారులందరికీ పంచదార అందనుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులు వారం నుండి పది రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచదార, కందిపప్పు నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాల నుండి నాణ్యతా లోపంపై ఫిర్యాదుల అందాయి. పౌరసరఫరాల సంస్థ పంచదారను కేవలం ప్యాకెట్ల రూపంలోనే అందిస్తోంది, లూజు పంచదార సరఫరా చేయడంలేదు. పంచదారలో నాణ్యతా లోపం ఏమైనా ఉంటే పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం''










