Feb 13,2023 20:50

విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

              పుట్టపర్తి రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వారి మేధస్సుకు పదును పెట్టారు. చిట్టి చేతులు... మేటి ప్రయోగాలను చేసి అందరి చేత ఔరా అనిపించారు. వందలాది మంది విద్యార్థులు ఒక చోట చేరి నమూనాల రూపంలో వారిలోని తెలివితేటలను బయట పెట్టారు. పుట్టపర్తిలోని జగరాజుపల్లి మంగళకర కళాశాలలో సోమవారం నిర్వహించిన శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2022-23లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అబ్బురపరిచేలా వివిధ నమూనాలను తయారు చేశారు. ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రాజెక్టులను తయారు చేసి వారిలోని ప్రతిభను చాటారు. ఇందులో ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులకు అందజేశారు. కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు. వాటి గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. నమూనాలు తయారు చేసిన ప్రతి విద్యార్థినినీ అభినందించారు. విద్యార్ధి దశలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకుని వాటికి సంబంధించిన ప్రయోగాలను చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. చిలమత్తూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి వి.సంపత్‌ కుమార్‌ ప్లాస్టిక్‌ పదార్థాలను ఉపయోగించి మొక్కలకు ఎరువులు వేసే పరికరం, రాత్రిపూట రైతులు పొలాల దగ్గరికి వెళ్లేప్పుడు పాముల బారిన పడకుండా ప్లాస్టిక్‌ పైపును భూమిపై ఊత కర్రవలే ఉపయోగించి శబ్ధం చేయడం, పేడను చేతితో పిడకలు తయారు చేయకుండా ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగించి చేసే నమూనాలను తయారు చేశాడు. పర్యావరణ అనుకూల పదార్థాలకు సంబంధించి ఈ విద్యార్థి తయారు చేసిన నమూనాలకు ప్రథమ బహుమతి లభించింది. అగళి ఎపిఎంస్‌ 9వ తరగతి విద్యార్థి విశ్వనాథ్‌ పొలాలలో కోతుల బెడద లేకుండా శబ్ధం చేసే పరికరాన్ని తయారు చేశాడు. ఆరోగ్యం పరిశుభ్రత విభాగంలో ధర్మవరం బిఎస్‌ఆర్‌ బాలికల పాఠశాల పదవ తరగతి విద్యార్థిని ఎస్‌.ఉమీర ప్రథమ బహుమతి, నాగసముద్రం పదవ తరగతి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థి లక్ష్మీనరసింహా ద్వితీయ బహుమతికి ఎంపిక అయ్యారు. సాఫ్ట్‌వేర్‌, యాప్‌ విభాగంలో ధర్మవరం బిఎస్‌ఆర్‌ బాలుర మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థి జి.నారాయణ డే టు డే యాప్‌ను తయారు చేసినందుకుగాను ప్రథమ బహుమతి లభించింది. పరిగి మండలం ధనపురం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ విద్యార్థి ఎల్‌.మంజుల స్మార్ట్‌ పార్కింగ్‌ సర్వీస్‌ సిస్టం తయారు చేసినందుకు ద్వితీయ బహుమతికి ఎంపిక అయ్యింది. గణిత నమూనాకు సంబంధించి తనకల్లు ఏపీటీడబ్ల్యూఆర్‌ బాలికల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని వి.తులసి ప్రథమ బహుమతి, చిలమత్తూరు జడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ 10వ తరగతి విద్యార్థి వి.ధనుంజయ ద్వితీయ బహుమతి సాధించాడు. పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి రామగిరి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ 8వ తరగతి విద్యార్థి బి.వెంకటేష్‌, ప్రథమ బహుమతి, కొత్తచెరువు జెడ్పీ పాఠశాల విద్యార్థి కె.జాహ్నవి ద్వితీయ బహుమతి సాధించారు. ఇలా దాదాపు 120 ప్రదర్శనలను విద్యార్థులు తయారు చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందరికీ కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ బహుమతులను అందజేశారు.