ప్రజాశక్తి-విజయవాడ
నగరంలోని చిరు వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, వ్యక్తిగతంగా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరుతూ విజయవాడ హాకర్స్ అండ్ తోపుడుబండ్ల వ్యాపారుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శ్రీశ్రీ భవన్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాద్ మాట్లాడుతూ...హాకర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 16న విజయవాడ నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్నాలో నగరంలోని చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ నగరంలో 25 వేల మందికి పైగా చిరు వ్యాపారస్తులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వీరంతా నగరంలో గత మూడు, నాలుగు దశాబ్దాల నుంచి వివిధ చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ నుండి ఎటువంటి సహాయం అందకపోవటంతో, ప్రయివేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి, వ్యాపారాలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికయినా చిరు వ్యాపారులకు వ్యక్తిగత రుణ సదుపాయం కల్పించాలని కోరారు. సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె. దుర్గారావు, సిఐటియు నగర ఉపాధ్యక్షులు వై. సుబ్బారావు, విజయవాడ హాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బెవర వెంకటేశ్వరరావు, సి.హెచ్ మురళీ, నాయకులు బాల బొమ్మ లక్షణ, కె. హేమంత్ కుమార్, గంటా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.










