Jul 19,2021 09:36

గుంటూరు : చెల్లిని వంచించాడు. అక్కను మోసగించి.. రహస్యంగా వివాహమాడాడు. మాయమాటలు చెప్పి ఆ కుటుంబం నుండి బంగారాన్ని, లక్షల రూపాయలను కాజేసి మోసం చేశాడు. ఆ మహా మాయగాడయిన యువకుడిని గుంటూరు చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్పీ ప్రశాంతి విలేకరులతో సమావేశమై వివరాలను వెల్లడించారు. చేబ్రోలుకు చెందిన వేములపల్లి జోషిబాబు ఇంజినీరింగ్‌ చదివి పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చిలకలూరిపేటకు చెందిన ఓ బాలిక 2019 లో వేసవి సెలవుల కోసం చేబ్రోలులో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. జోషిబాబు కన్ను ఆ బాలికపై పడింది. బాలిక వెంటపడ్డాడు. ఫోన్‌ నంబర్‌ ఇవ్వకపోతే యాసిడ్‌ పోస్తానని, అమ్మమ్మను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో కాల్‌ చేసి ఆమెతో నగ్నంగా మాట్లాడించాడు. డబ్బులు ఇవ్వకపోతే నగ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. ఆ బాలిక వద్ద నుండి బంగారు గొలుసు తీసుకున్నాడు. తర్వాత ఆ బాలిక తండ్రికి ఫోన్‌ చేసి బాలిక నగ్న వీడియోలు, ఫొటోలు వేరేవారి దగ్గర తాను చూశానని, వాటిని తొలగించాలంటే ఖర్చవుతుందంటూ మాయ మాటలు చెప్పి రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. మరోవైపు.. వాటిని డిలీట్‌ చేయిస్తానంటూ బాలిక సోదరితో మాట్లాడి ఆమె నుంచి బంగారు గొలుసును కాజేశాడు. తర్వాత ఆమెకు కూడా మాయమాటలు చెప్పి ప్రేమాయణం నడిపాడు. ఈ నెల 13 న అమెను రహస్య వివాహం చేసుకున్నాడు. జోషిబాబు మోసాన్ని గుర్తించిన బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ మధుసూదనరావు, ఎస్సై కోటేశ్వరరావు శనివారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. అతని వద్ద రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.