* నేడు జాతీయ చేనేత దినోత్సవం
వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి చూపించేది చేనేత రంగమని పాలకులు తరచూ చెప్తుంటారు. అలాంటి చేనేత రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభం లోకి నెడుతున్నాయి. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన మొదటి సంవత్సరం...తమిళనాడులో ఆర్భాటంగా చేనేత దినోత్సవం జరిపి చేనేత రక్షణకు తమ బీజేపీ ప్రభుత్వం కట్టుబడి వుందని ప్రకటించారు. కానీ ఆచరణలో ఆ పరిశ్రమను ధ్వంసం చేసే విధానాలు అమలు జరిపి చేనేతను సంక్షోభం లోకి నెట్టేశారు. బీజేపీ వారు ప్రతిపక్షంలో ఉన్నపుడు తాము అధికారం లోకి వస్తే సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు చేనేత రంగానికి కేటాయిస్తామని చెప్పారు. 2014లో అధికారానికి వచ్చాక...5 సంవత్సరాలలో బడ్జెట్‌కు రూ. 25 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ.2808 కోట్ల 20 లక్షలు మాత్రమే కేటాయించి చేనేతకు ద్రోహం చేశారు. అదేకాక చేనేత కార్మికులకు ఉన్న ఆరోగ్య బీమా పథకం, ఐసిఐసిఐ లాంబార్డ్ పథకం కార్డులు రద్దు చేశారు. దానితో రాష్ట్రం లోని చేనేత కార్మికులకు ఉచిత వైద్యం లేక ప్రయివేటు ఆసుపత్రులలో ఖర్చు భరించలేక అనారోగ్యం పాలవుతున్నారు. మహాత్మాగాంధీ బునకర్ యోజన స్కీమ్, ఇన్సూరెన్స్ కింద చేనేత కార్మికులు సంవత్సరానికి రూ. 80 రూపాయలు చెల్లిస్తే, ఒకవేళ చేనేత కార్మికులు ఈ ఇన్సూరెన్స్ పథకంలో ఉన్నవారు చనిపోయినట్లయితే రూ.60 వేలు చెల్లించేవారు. ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి రూ.1200 స్కాలర్‌షిప్ ఇచ్చేవారు. మోడీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ని రద్దు చేసి చేనేత కార్మికులకు తీరని అన్యాయం చేసింది.
చేనేతకు కేటాయించిన, రిజర్వు చేసిన 11 రకాల వస్త్రాలను నిబంధనలను ఉల్లంఘించి పవర్‌లూమ్ మగ్గాలపై తయారు చేస్తున్నారు. దీనితో మార్కెట్‌లో పవర్‌లూమ్ వస్త్రాలతో చేనేత వస్త్రాలు పోటీ పడలేక చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడి చేనేత కార్మికులు పనులు కోల్పోయి ఇతర వత్తులకు మరలుతున్నారు. చేనేత సహకార రంగంలో తయారైన వస్త్రాలను మార్కెట్ చేయటానికి ప్రారంభించిన ఆప్కోకు పాలక పార్టీల చేయూత క్రమంగా తగ్గిపోయింది. మరోవైపు ప్రవేటు రంగం లోని మాస్టర్ వీవర్ల దగ్గర తయారైన వస్త్రాల కొనుగోలుకు ఆప్టెక్సును ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. ఆ తరువాత ఆప్టెక్సును చంద్రబాబు ఏకంగా మూసివేశారు. దీంతో మాస్టర్ వీవర్ల దగ్గర తయారైన వస్త్రాలకు మార్కెట్ కోసం వెతుకులాట ప్రారంభించాల్సి వచ్చింది. పవర్ లూమ్ పోటీకి చేనేత మార్కెట్ కుదించుకు పోవడంతో మాస్టరు వీవర్లు కొంతమంది మగ్గాలు పూర్తిగా మూసివేశారు. ఫలితంగా చేనేత కార్మికులు పనులు కోల్పోయి ఈ రంగం నుండి ఇతర రంగాలకు వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం జిఎస్‌టి తీసుకు వచ్చింది. చేనేతపై కూడా ఈ పన్ను వేసింది. దీనితో చేనేత వస్త్రం ధరలు పెంచి అమ్మాల్సి వచ్చింది. చేనేత పరిశ్రమ మరింత సంక్షోభం లోకి నెట్టబడింది.
రాష్ట్రంలో 2014లో అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు తన బడ్జెట్‌లో సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానని చెప్పి 5 సంవత్సరాలకు రూ. 819 కోట్ల 72 లక్షలు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేశారు. చేనేత వద్ధులకు ప్రధాన కేంద్రాలలో ప్రత్యేక ఆసుపత్రులు, వద్ధాశ్రమాలు నిర్మిస్తామని, ఇల్లు లేని చేనేత కార్మికులకు మగ్గం షెడ్‌తో కూడిన ఇళ్ళు ఉచితంగా నిర్మించి ఇస్తానని వాగ్దానం చేశారు. ఆచరణలో ఏ ఒక్కటీ అమలు పరచలేదు. దీనికి భిన్నంగా చేనేతను దెబ్బతీసే పవర్‌లూమ్ యజమానులకు అనేక రాయితీలు ఇచ్చి చేనేతను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో 2019లో అధికారానికి వచ్చిన వైఎస్సార్‌సిపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేనేతకు అండగా ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తానని ప్రకటించారు. కానీ 2019లో కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారు. 2020లో చేనేతకు బడ్జెట్‌లో ఏమాత్రం కేటాయించకుండా చేనేతకు అన్యాయం జరిగేటట్లు వ్యవహరించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే ప్రతి మగ్గానికి రూ. 24 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 81 వేల మందికి రూ. 24 వేలు బ్యాంకులలో వేసి మిగతా వారికి అన్యాయం చేశారు. సొంత ఇళ్ళు లేక అద్దె ఇంట్లో ఉంటూ మగ్గం కూడా అద్దెకు తీసుకొని నేత పని చేస్తూ, వస్తున్న ఆదాయంలో అద్దెలు చెల్లించుకుంటూ, మిగిలిన ఆదాయం కుంటుంబానికి సరిపోక అర్ధాకలితో గడుపుతున్న చేనేత కార్మికులకు ఈ పథకం వర్తించదని చెప్పటం తీరని అన్యాయం.
మరొకపక్క 2020 మార్చి నుండి కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం అన్యాయం. ఈ రోజు మాస్టరు వీవర్లు లాక్‌డౌన్ పేరుతో వ్యాపారాలు లేవని చేనేత కార్మికులకు పని చూపించటం లేదు. తమ దగ్గర నిల్వ వున్న వస్త్రాలు అమ్ముడు పోకుండా పని చూపించలేమని చెబుతున్నారు. అందువలన మాస్టరు వీవర్ల దగ్గర ఉన్న వస్త్రాలను, సహకార సంఘాల దగ్గర ఉన్న వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలి. చేనేత కార్మికులకు పని కల్పించాలంటే జరీ కావాలి, అది సూరత్ నుండి రావాలి. పట్టు కావాలంటే చైనా నుండి బెంగుళూరుకు అక్కడి నుండి మన రాష్ట్రానికి రావాలి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో రవాణా సౌకర్యాలు దొరకవు. కనుక రానున్న ఆరు నెలల కాలం లో చేనేత కార్మికులకు పనులు దొరకవు. ప్రభుత్వం ప్రతి చేనేత కార్మికునికి నెలకు రూ.7500 చొప్పున 2020 డిసెంబరు వరకు ఇచ్చి....చేనేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురికాకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వం చేనేతకు జిఎస్‌టి ని రద్దు చేయాలి. ఎన్‌హెచ్‌డిసి ద్వారా నూలు సప్లై చేయాలి. సహకార సంఘాలు, మాస్టరు వీవర్ల దగ్గర ఉన్న వస్త్రాలు కొనుగోలు చెయ్యాలి. వెంటనే డబ్బు చెల్లించాలి. నూలు, జరీ, పట్టును ప్రభుత్వం సరఫరా చేయాలి. కరోనా నేపథ్యంలో ప్రతి చేనేత కార్మికునికి నెలకు రూ. 7500 ఇవ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి 20 నెలలు గడుస్తున్నా డబ్బు చెల్లించలేదు. సహకార సంఘాలకు వెంటనే డబ్బు చెల్లించాలి. యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ, ట్రిప్ట్ ఫండ్ డబ్బు సంవత్సరం నుండి చెల్లించలేదు. వెంటనే ఆ డబ్బు విడుదల చేయాలి. షెడ్ లో నేత నేస్తున్న చేనేత కార్మికులకు రూ.24 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం కూడా పవర్‌లూమ్ యజమానులను అడ్డుకోలేక పోతోంది. దీనివల్ల భవిష్యత్తులో చేనేత పరిశ్రమ కుదించుకుపోతుంది. కనుక చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు జరిపి, ఉల్లంఘించిన పవర్‌లూమ్ యజమానులపై చర్యలు తీసుకోవాలి. చేనేత రక్షణకు కేరళ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి...అమలు జరపాల్సిన అవసరం ఉన్నది.
కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేరళ రాష్ట్రంలో మాదిరిగా ప్రత్యామ్నాయ విధానాలను అమలు పరిచి, చేనేత రక్షణకు, చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెరుగుదలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సహకార రంగాన్ని పటిష్ట పరచాలి. చేనేత కార్మికులందరిని సహకార రంగం లోకి తీసుకువచ్చి పరిశ్రమను రక్షించాలి.
* పిల్లలమర్రి బాలకృష్ణ (వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్ : 9849431258)










