రెండు రోజుల పాటు బీజింగ్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, 14వ పంచవర్ష ప్రణాళిక వ్యూహాన్ని గురు వారం నాడు విడుదల చేసింది. 2021-25 మధ్య అయిదేళ్ల దేశాభివృద్ధికి సంబంధించిన వ్యూహం పూర్తి పాఠం బయటకు రాకపోయినా ''ద్వంద్వ ప్రసరణ'' (డ్యూయల్ సర్క్యులేషన్) వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఏమిటీ ''ద్వంద్వ ప్రసరణ'' వ్యూహం?
ప్రతి వ్యూహాన్నీ ఒకటి లేక కొద్దిపాటి నినాదాల్లోకి కుదించడం చైనా కమ్యూనిస్టు పార్టీకి మొదటి నుండి ఆనవాయితీ. అదే విధంగా 14వ పంచవర్ష ప్రణాళిక వ్యూహాన్ని ''ద్వరద్వ ప్రసరణ'' అనే ఒకే నినాదంగా కుదించి చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు శాంతియుత అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి గనుక వాటిని ఉపయోగించుకుని చైనా అభివృద్ధికి బాటలు వేయాలని గతంలో హూ జింటావో నేతృత్వంలో పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే గత రెండున్నర దశాబ్దాల్లో అభివృద్ధి వ్యూహాన్ని అనుసరించి విజయాలు సాధించింది. కానీ చైనాను కట్టడి చేయాలన్న నినాదంతో అమెరికా రుద్దుతున్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం వలన ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు తీవ్రమైన ''అస్థిరతలకు, డోలాయమానాలకు'' గురి అవుతున్నాయి గనుక 14వ పంచ వర్ష ప్రణాళికలో చైనా పార్టీ దేశాభివృద్ధి వ్యూహాన్ని మార్చుకుంది.
దేశాభివృద్ధికీ, ఆర్థిక భద్రతకూ మధ్య సమతుల్యత సాధిస్తూ దేశాన్ని ఆధునిక ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడం ఈ కొత్త ''ద్వంద్వ ప్రసరణ'' విధానపు ప్రధాన లక్ష్యం అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇందులో చైనా అంతర్గత మార్కెట్‌కు ప్రధాన పాత్ర ఇస్తూ, అంతర్గత, అంతర్జాతీయ మార్కెట్లు రెండూ ఒకదానికొకటి సహకరించుకుంటూ అభివృద్ధి చెందుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన చైనా ఇక నుండి అంతర్గత మార్కెట్‌పై ప్రధానంగా ఆధారపడి అభివృద్ధి సాధిస్తుందన్నమాట.
''ద్వంద్వ ప్రసరణ'' వ్యూహం కింద చైనా తన దీర్ఘకాల, సుస్థిరాభివృద్ధి కోసం అంతర్గత మార్కెట్‌పై ప్రధానంగా ఆధారప డుతుందనీ, తద్వారా తన సరిహద్దులకు వెలుపల నెలకొనే అస్థిర పరిస్థితుల నుండి దేశార్థికాన్ని రక్షించుకుంటుందనీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యూహం ''ప్రస్తుత అస్థిర అంతర్జాతీయ వాతారణంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి మరిన్ని ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది, దేశాన్ని అధిక నాణ్యమైన, అంతర్గత వినియోగం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా మలుస్తుంది'' అని చైనాకు చెందిన అంతర్జాతీయ సంబంధాల సంస్థ పరిశోధకురాలు చెన్ ఫెంగీయింగ్ చెప్పారు. అదే సమయంలో పెట్టుబడి, నైపుణ్యాలు, సమాచారం, సాంకేతికతలు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ సజావుగా ప్రసరణ అవుతాయని ఆమె పేర్కొన్నారు.
అంతర్గత వినియోగంపై ఆధారపడి అభివృద్ధి సాంధిం చాలంటే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆదాయాలు పెరగాలి. దానికి గాను రెండు రకాల చర్యలను ప్రతిపాదించారు. మొదటిది, ఈ అయిదేళ్ల కాలంలో దేశ ప్రజలను తక్కువ వేతనాలు లభించే ప్రస్తుత చౌక ఉత్పత్తుల నుండి అధిక వేతనాలు లభించే ఆధునిక సాంకేతిక ఉత్పత్తులవైపు మళ్లిస్తారు. అంటే 2025 నాటికి చైనా హై టెక్నాలజీ పారిశ్రామిక రంగాల్లో వేగంగా ముందుకు పోయి పశ్చిమ దేశాల స్థాయిని అందుకోవాలన్నది దీని లక్ష్యం. వీటిలో 10 ప్రధాన రంగాలున్నాయి. అవి 1. ఎలక్ట్రిక్ కార్లు, ఇతర కొత్త ఇంధన వాహనాలు 2. కొత్త తరం ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలి కమ్యూనికేషన్లు 2. ఆధునిక రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) 4. వ్యవసాయ టెక్నాలజీ 5. అంతరిక్ష, గగనతల ఇంజినీరింగ్ 6. కొత్త సింథటిక్ వస్తువులు 7. ఆధునిక విద్యుత్ పరికరాలు 8. కొత్త తరం బయో ఔషధాలు 9. ఆధునిక రైల్వే సదుపాయాలు 10. హైటెక్ సముద్ర ఇంజినీరింగ్.
ఇప్పటివరకు చైనా మౌలిక వినిమయ వస్తువులైన వస్త్రాలు, చెప్పులు, నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులు విదేశాలకు ఎగుమతి చేస్తూ అభివృద్ధి సాధించింది. తక్కువ వేతనాలతో తయారయ్యే ఈ తక్కువ విలువైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడంలో అది మెక్సికో, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తైవాన్ వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతోంది. దాని వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ మధ్య స్ధాయికి వచ్చి ఆగిపోయే ప్రమాదం ఉంది. దీన్నే 'మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్' అంటారు. దీన్ని అధిగమించి అభివృద్ధి చెందాలంటే అది కార్మికులకు అధిక వేతనాలు లభించే అత్యాధునిక పరిశ్రమల వైపు నడవాల్సిందే. వాస్తవానికి చైనా ప్రధాని లీ క్వెకాంగ్ 2015లో విడుదల చేసిన 'మేడ్ ఇన్ చైనా 2025 వ్యూహం'లో ఇది అంతర్భాగమే.
ప్రపంచ వస్తూత్పత్తి విలువ గొలుసులో (గ్లోబల్ ప్రొడక్షన్ చైన్) చైనా దిగువ భాగంలో ఉంది. అంటే అది ఉత్పత్తి గొలుసులో తక్కువ విలువను సమకూర్చుతోంది. అత్యాధునిక రంగాల్లో అభివృద్ధి చెందడం ద్వారా ఈ గొలుసులో పైపైకి పోయి అమెరికా స్థాయికి ఎదగాలని అది లక్ష్యం నిర్దేశించుకుంది. అందుకే 2020 నాటికి కీలక వస్తువుల ఉత్పత్తిలో 40 శాతం, 2025 నాటికి 75 శాతం చైనా ఉత్పత్తి చేయాలని నిర్ణయిం చింది. ఆధునిక హైటెక్ రంగం ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, సెమీ కండక్టర్ల విషయంలో చైనా వెనుకబడి ఉంది.
ప్రపంచ సెమీ కండక్టర్లలో 60 శాతం చైనాలో వినియోగించబడుతున్నా యి. కానీ ఇక్కడ 13 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన భాగం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అందు వల్ల 2025 నాటికి హైటెక్ రంగంలో 70 శాతం స్వయం సమృద్ధి సాధించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ జాతీయ మహాసభ నిర్దేశించింది.
ఈ 'ప్రణాళిక'కు అనుగుణంగానే చైనా ఇటీవలి కాలంలో సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తులను తగ్గించి హైటెక్, ఉన్నత జీతాలు ఇచ్చే పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచడం ప్రారంభించింది. సోలార్ పరిశ్రమ, బుల్లెట్ రైళ్లు, ఇతర ఆధునిక పరిశ్రమల్లో అది ఉరకలు పరుగులు పెడుతోంది.
ఇక చైనా ప్రజల కొనుగోలు శక్తి పెంచే రెండవ మార్గం గ్రామాలు, పట్టణాలకు మధ్య అంతరాన్ని తగ్గించడం. ప్రస్తుతం చైనాలో 50 శాతం పట్టణీకరణ జరిగింది. అంటే ఇంకా 70 కోట్ల మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. చైనాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని 13వ ప్రణాళిక లక్ష్యంగా చేసుకుని దాదాపు లక్ష్యం పూర్తి చేసింది. 13వ ప్రణాళిక ప్రారంభం నాటికి అంటే 2016 నాటికి దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 6 కోట్ల మంది పేదలుండగా వారిలో 5.5 కోట్ల మందికి పైగా ప్రజలను పట్టణాల్లో పునరావాసం కల్పించారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడమే కాదు గ్రామీణ ప్రజలందరి ఆదాయాలు గణనీయంగా పెంచడం ద్వారా దేశంలో మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని 14వ ప్రణాళికలో నిర్దేశించారు.
13 వ ప్రణాళికా కాలంలో (2016-2020) చైనా ఆర్థిక వ్యవస్థ 15 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 1100 లక్షల కోట్లు)కు పెరిగింది. అమెరికా (20.33 లక్షల కోట్ల డాలర్ల) తరువాత రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. వాస్తవానికి కొనుగోలు శక్తి సమానత (పిపిపి) దృష్ట్యా చూసినప్పుడు 2018 నాటికే చైనా 24 లక్షల కోట్ల డాలర్లతో అమెరికాను అధిగమించి ప్రథమ స్థానం లోకి వెళ్లిపోయింది.
వచ్చే ఏడాదికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటికి దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి ''చైనా పేద దేశం'' అనే స్థితి నుండి ''చైనా ఒక మాదిరి అభివృద్ధి చెందిన దేశం'' అనే స్థాయికి తీసుకుపోవాలని కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు. 2035 నాటికి చైనాను పారిశ్రామికంగా ఆధునీకరించి 2049 నాటికి అంటే చైనా విముక్తి చెంది 100 ఏళ్లు గడిచే నాటికి దేశాన్ని ఆధునిక సోషలిస్టు దేశంగా రూపొందించాలన్నది కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ప్రణాళికాబద్దంగా 140 కోట్ల మంది (ప్రపంచ జనాభాలో సుమారు అయిదో వంతు) ప్రజలను సుస్థిర అభివృద్ధి వైపు నడుపుతున్న ఘనత చైనాలోని సోషలిస్టు వ్యవస్థదీ, దాన్ని నడుపుతున్న కమ్యూనిస్టు పార్టీది. కరోనా మహమ్మారిని అదుపు చేయలేక పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే సోషలిస్టు చైనా, వియత్నాంలు దానికి భిన్నంగా మహమ్మరిని కట్టడి చేసి అభివృద్ధిని నమోదు చేయడమే సోషలిజం విశిష్టతకు స్పష్టమైన నిదర్శనం.
ఎస్. వెంకట్రావు










