Oct 31,2022 12:47

ముంబయి  :   దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 600 పాయింట్ల లాభంతో 60,600 వద్ద ట్రేడవుతూ ఆరువారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో సూచీలు గరిష్టానికి చేరుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు బుధవారం ప్రకటించనుంది. దీంతో మరో 75 బేసిస్‌ పాయింట్ల పెంపును మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఫెడ్‌ను అనుసరిస్తే అది దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు.

అధిక ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాలతో గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు గత నాలుగు నెలలుగా రికవరీ పెంపును చూశాయి. 2022, జూన్‌ 17న 51,360 ఉన్న సెన్సెక్స్‌ .. సోమవారం గరిష్టంగా 18 శాతం పెరిగి 60,600కు చేరింది. నిఫ్టీ 162 పాయింట్లు లాభపడి 17,949 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.34 వద్ద ట్రేడవుతోంది.