- బిజెపితో ప్రజాస్వామ్యానికి ముప్పు : పినరయి విజయన్
- గవర్నర్లు రాజకీయం చేస్తున్నారు : కేజ్రీవాల్
- ప్రధాని మోడీ చెప్పేవన్నీ అబద్దాలే : భగ్వంత్ మాన్
- సమాఖ్య వ్యవస్థకు తూట్లు : డి రాజా
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : ప్రజాస్వామ్యాన్ని, భారతీయ లౌకిక విధానాన్ని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోన్న బిజెపిని ఓడించాలని భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) తొలి బహిరంగ సభ పిలుపునిచ్చింది. విపక్ష పార్టీలన్నీ అదే లక్ష్యంగా పనిచేయాలని కోరింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఖమ్మంలో బుధవారం జరిగిన బిఆర్‌ఎస్ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగ్వంత్ మాన్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, పలు ప్రాంతీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. కేరళ సిఎం పినరయి విజయన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి బిజెపి ముప్పుగా మారిందన్నారు. దేశ సమగ్రతను, లౌకికతత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. కేంద్రప్రభుత్వ వైఖరితో దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో, రాజ్యాంగం సంక్షోభంలో పడ్డాయన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రాల హక్కులు, అధికారాలను కాలరాస్తోందని, గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందన్నారు. కులం, మతం పేరుతో దేశాన్ని నిలువునా చీలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృ భాషలను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. కార్పొరేట్లకు తొత్తుగా ప్రధాని మోడీ మారారని, న్యాయ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ బిజెపి నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్డు తగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉందని విమర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ సింగ్ మాట్లాడుతూ రంగురంగుల పూల సమాహారమైన దేశంలో ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని బిజెపిని ఉద్దేశించి విమర్శించారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. లోకతంత్రం కాదు... లూటీ తంత్రాన్ని బిజెపి నడిపిస్తోందని దుయ్యబట్టారు. భగత్ సింగ్‌ను స్మరించుకున్న ఆయన 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదం చేసి ప్రసంగం ముగించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ బిజెపిని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమన్నారు. బిజెపి పాలనలో భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని తెలిపారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందని, భారత్‌ను హిందూ దేశంగా మార్చే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపిపై ఐక్యపోరాటానికి ఈ సభ నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపిని తరిమికొడదామని, యుపిలో కూడా ఆ పార్టీని వెళ్లగొడుతామని అన్నారు. ప్రగతిశీల నేతలు ఒక్కటి కావాలని ఆకాంక్షించారు.
- ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే బిఆర్‌ఎస్ పుట్టింది : కెసిఆర్
ప్రశ్నించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బిఆర్‌ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. ప్రజల ఆస్తులను ప్రజలపరం చేయడమే బిఆర్‌ఎస్ లక్ష్యమని తెలిపారు. దేశం వెనకబాటుతనానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే కులం, మతం పేరుతో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ కానీ బిఆర్‌ఎస్ ప్రతిపాదించే ప్రభుత్వం కానీ అధికారంలోకొస్తే దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్తు, రైతుబంధు అమలు చేస్తామని, దళితులందరికీ దళిత బంధు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి పాత విధానం కొనసాగిస్తామన్నారు. విద్యుత్తు సంస్థలను, ఎల్‌ఐసిని ప్రయివేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మేసినా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. బిజెపి పాలసీ ప్రయివేటైజేషన్ అయితే... బిఆర్‌ఎస్ పాలసీ నేషనలైజేషన్ అని తెలిపారు. జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తామని, విజయం మనదే అని కెసిఆర్ ప్రకటించారు. బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఖమ్మం కలెక్టరేట్ భవన నూతన సముదాయాన్ని కెసిఆర్, పినరయి విజయన్ ప్రారంభించారు.










