బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో, నిర్భయ ఉదంతం తరహా ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. మహిళలపై పెచ్చు మీరుతున్న హింస, అత్యాచారాలు, దాడులకు పోలీసులు, ప్రభుత్వాలు కొమ్ము కాయడం అత్యంత దారుణం. రెండు వారాల క్రితం యు.పి లోని హథ్రస్ గ్రామంలో ఓ దళిత మహి ళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పదిరో జులకు పైగా మృత్యువుతో పోరాడి ఆమె ఓడిపో యింది. మృతురాలి అంత్యక్రి యలు కూడా తల్లిదండ్రుల అభీష్టం మేరకు జరపకుండా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె చితికి నిప్పంటించారు పోలీసులు. ఇటువంటి దారుణ ఘటనలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. అత్యాచారం జరిగిన నాలుగు రోజుల వరకు నింది తులను అరెస్టుచేయకుండా ఉండడం, మృతురాలి పట్ల అమానవీయంగా ప్రవర్తించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యు.పి పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
నెలరోజుల వ్యవధిలోనే కదులుతున్న వాహ నాల్లో జరిగిన అత్యాచారాలు యు.పిలో మూడు వెలుగుచూశాయి. అలాగే అత్యాచా రానికి గురైన 17 ఏళ్ల యువతి కేసు పెట్టిందని నిందితులు, ఆమెను, ఆమె తల్లిని ట్రాక్టరుతో తొక్కించిన ఘటన కూడా యు.పి లోనే చోటుచేసుకుంది. వారికి బెయిల్ కూడా మంజూరు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదని జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదిక- 2019 స్పష్టం చేస్తోంది. బాధితుల పట్ల ప్రభు త్వాలు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తాయో 2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉన్నావ్ ఉదంతం కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఆ ఒక్క సంవత్సరమే యు.పిలో మహిళలపై జరిగిన హింసాత్మక కేసులు 50 వేలకు పైగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జరిగిన వరుస ఘటనలు యు.పి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దంపడుతున్నాయి. మార్చి 12న ఉన్నావ్‌లో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అలాగే ఏప్రిల్ 17న ఓ రేషను దుకాణదారుడు 23 ఏళ్ల యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఉచిత రేషను ఇస్తానని వాగ్దానం చేసి నమ్మించి ఆమె ఇంటికి వెళ్లిమరీ ఈ దారుణం చేశాడు. మే నెలలో 15 ఏళ్ల బాలిక కూడా ఈవిధంగానే టైలరింగ్ షాపుకు వెళ్తూ అపహరణకు గురై అత్యాచారానికి గురైంది. ఆగష్టు నెలలో యు.పిలోని హపూర్ జిల్లాలో ఆరేళ్ల మైనర్‌ను శారీరకంగా హింసించి, అత్యాచారం చేశారు. చికిత్స నిమిత్తం మూడు ఆస్పత్రులు తిప్పాల్సి వచ్చింది.. నిందితులను ఆ పాప గుర్తించినా ఇంతవరకు వారిని పట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత ఉంటుంది.
కేసు పెట్టినా న్యాయం జరగడం లేదు
2019లో ఉన్నావ్ ప్రాంతంలోనే 86 అత్యాచార కేసులు నమోద య్యాయి. ఆ సంవత్సరం 23 ఏళ్ల బాధిత మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ ఇద్దరిపై కేసు పెట్టింది. అయితే అరెస్టు చేసిన కొన్ని రోజులకే వారిద్దరూ బెయిల్ మీద విడుదలై బాధితురాలిని బెదిరించడం మొదలు పెట్టారు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి రక్షించు కునేందుకు, ఎవరైనా సహాయం చేస్తారేమోనన్న ఆశతో ఆమె ఒక కిలోమీటరు దూరం ఆగకుండా ప్రయాణించింది. సాయం అందలేదు కాని వేగంగా పరుగెత్తడం వల్ల ఆ యువతి అక్కడికక్కడే గుండెపోటుకు గురై మర ణించింది. కేసు పెట్టిన తరువాత బాధితులకు రక్షణ కల్పించకపోవడం వల్లే మళ్లీ మళ్లీ దారు ణాలు పునరావృతం అవుతున్నాయి. మనువాద భావజాలం, పురుషాధిక్య భావజాలం నరనరాన జీర్ణించుకున్న వారే ఇటువంటి దారుణాలకు తెగబ డుతున్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారి వస్త్రధారణపై అభ్యంత రాలు చెప్పడం, స్వతంత్ర భావాలు గల మహిళలను విచ్చలవిడితనం అంట గట్టడం బిజెపి పెద్దలకు పరిపాటి. అటువంటి పాలకుల అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు భద్రత, రక్షణ కరు వైంది. వీటికి అడ్డుకట్టవేయక పోతే ఎంతటి వారై నా సరే... ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
- జ్యోతిర్మయి










