Dec 17,2021 08:51

ప్రజాశక్తి- యంత్రాంగం : జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) దేశవ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె మొదటి రోజు పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండు రోజుల సమ్మె పిలుపులో భాగంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు గురువారం విధులను హాజరు కాలేదు. దీంతో, బ్యాంకింగ్‌ లావాదేవీలు స్తంభించాయి. సమ్మెలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. సిఐటియు, ఎఐటియుసి, ప్రజాసంఘాల నాయకులు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పాల్గొని మద్దతు తెలిపారు. సమ్మెలో భాగంగా విజయవాడ గాంధీ నగర్లోని ఎస్‌బిఐ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ ప్రైవేటీకరణ, ద్రవీకరణ నినాదంతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కారుచౌకగా పెట్టుబడు దారులకు అప్పగించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. దేశంలో బలవంతమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉండడం వల్లే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం మన దేశంపై పడలేదన్నారు. రైతుల పోరాట స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. యుఎఫ్‌బియు కన్వీనర్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాన మంత్రిపై ఉందన్నారు. ఎపి మెడికల్‌ సెల్స్‌ అండ్‌ రిప్రజెంటివ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి యు.వి.కృష్ణయ్య, ఐఎఫ్‌టియు నాయకులు రవిచంద్ర, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రమాదేవి, ఐసిఇయు జాయింట్‌ సెక్రటరీ కళాధర్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎఐబిఓసి రాష్ట్ర కార్యదర్శి వైవి సత్యనారాయణ, ఎన్‌సిబి కేంద్ర కమిటీ సభ్యులు భవానీ ప్రసాద్‌, బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ అజరు కుమార్‌ పాల్గొన్నారు. వన్‌టౌన్‌ ఆంధ్రా బ్యాంకు జోనల్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బ్యాంకింగ్‌ రంగం డబ్బు మొత్తం దోచుకుని ఎన్నికల్లోకి వెళ్లాలనే కుట్రతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ నగరంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ బ్యాంకులు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఆన్‌లైన్‌ సేవలన్నిటిపైనా ప్రత్యేక పన్నుల భారం పడనుందని, ప్రతి సేవకూ పన్నుల వడ్డన, డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు వంటివి జరగనున్నాయని తెలిపారు. తక్కువ వడ్డీకి విద్య, గృహ రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదని, ఉచిత సేవలు బ్యాంకుల్లో కనుమరుగుకానున్నాయని పేర్కొన్నారు. యుఎఫ్‌బియు వైజాగ్‌ ఛాప్టర్‌ కన్వీనర్‌, ఎస్‌బిఐ జోనల్‌ ఆఫీస్‌ నాయకులు ఎ.సుష్మా మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె బ్యాంకుల ఆర్థిక డిమాండ్లపైన కాదని, యావత్‌ దేశ ప్రజల కోసమని తెలిపారు. కర్నూలు యూనియన్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు సభ నిర్వహించారు. గుంటూరులో ఎస్‌బిఐ వద్ద, జిటి రోడ్డులోని యూనియన్‌ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగుల నిర్వహించిన సభల్లో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిఐటియు, ఎఐటియుసి, తదితర సంఘాల నాయకులు పాల్గొని సమ్మెకు మద్దతు పలికారు. బ్యాంకుల సమ్మెతో తూర్పుగోదావరి జిల్లాలో రూ.600 కోట్లకుపైగా, ప్రకాశం జిల్లాలో రూ.1500 కోట్లు, విజయనగరం జిల్లాలో సుమా రు రూ.500 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో రూ.379 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతి లో బ్యాంకు ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని, రుణాలు స్వాహా చేసిన కార్పొరేట్‌ కంపెనీల నుంచి రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోనూ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతమైంది.