Mar 25,2023 21:02

- బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీ పట్టాభిరామాలయం

వాల్మీకిపురం : వాల్మీకిపురంలో వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణమంతా రంగులు వేశారు. స్వాగత తోరణాలు, రంగు రంగు విద్యుత్తుదీపాల కాంతులు, శ్రీరాముని కటౌట్లు, ఆరుబయట కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు టిటిడి వేధపండితులు మంత్రోచ్ఛరణల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేస్తారు. 27వ తేదీన ఉదయం ధ్వజారోహణం, రాత్రి గజ వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. పట్టాభిరాముని ఊరేగింపు ఉంటుంది. 28న ముత్యపు పందిరి, హనుమంత వాహనంపై ఊరుగుతారు. 29న కల్పవృక్ష, సింహ వాహనంపై ఆశీనులవుతారు. 30న సర్వ భూపాల, పెద్దశేష వాహనం, 31న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, రాత్రి మోహినీ అవతారం ఉంటుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీన తిరుచ్చి ఉత్సవం, రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, గరుడ వాహనంపై స్వామి ఊరేగుతారు. 2న రథోత్సవం, సాయంత్రం ధూళి ఉత్సవం ఉంటుంది. 3న తిరుచ్చి ఉత్సవం, రాత్రి అశ్వ వాహనం, పార్వేట ఉత్సవం ఉంటుంది. 4వ తేదీ వసంతోత్సవము, చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణం, 5వ తేదీ స్నపన తిరుమంజనం, సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.