Jul 18,2021 22:40
  • తొలి మ్యాచ్‌లోనే కిషన్‌ అర్ధ సెంచరీ
  • రాణించిన పృథ్వీషా, సూర్యకుమార్‌
  • 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ధావన్‌ సేన విజయం


కొలంబో : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. యువ భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్‌ చివర్లో చమికా కరుణరత్నె (43 నాటౌట్‌ 35 బంతుల్లో 1×4-2×6) రెచ్చిపోవడంతో భారత్‌ ముందు లంక జట్టు పోరాడే స్కోరు అందించాడు. అవిష్కా ఫెర్నోండో (32), మినోద్‌ భానుక (27) చరిత అసలంక (38) కెప్టెన్‌ షనకా (39) చక్కటి సహకారంతో స్కోరు బోర్డు ముందుకెళ్లింది. భారత్‌ బౌలర్ల వేగానికి మొదట్లో తడబడిన శ్రీలంక వికెట్లు పడుతున్నా చివరలో ధాటిగా ఆడారు. దీంతో గౌరవప్రదమైన స్కోరు సాధించారు. బౌలర్లలో చహర్‌, కుల్దీప్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ 9 ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు.

కిషన్‌, సూర్య కుమార్‌ అరంగేట్రం..

కిషన్‌, సూర్య కుమార్‌ అరంగేట్రం..
టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు వన్డే అరంగేట్రం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వీరిద్దరూ తాజాగా వన్డేల్లో అరంగేట్రం చేశారు. 263 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇండియా ఓపెనర్లుగా పృధ్వీషా, శిఖర్‌ ధావన్‌ క్రీజులోకి వచ్చారు. చమీరా వేసిన తొలి ఓవర్‌లోనే రెండు, మూడు బంతులు బౌండరీలుగా మలిచారు. ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా (24 బంతుల్లో 43 4×9) అనవసరపు షాట్‌ ఆడి వికెట్‌ను పారేసుకున్నాడు. స్పిన్నర్‌ ధనుంజయ డిసిల్వా ఫ్లయిటెడ్‌ డెలివరీని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో పెవిలియన్‌ బాట పట్టాడు. ధావన్‌తో జత కట్టిన బర్త్‌డే బారు ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో విరు చుకు పడ్డాడు. వచ్చీరావడంతోనే ఫోర్లు సిక్సర్లతో లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. కేవలం 31 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కును చేరుకున్న కిషన్‌ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. (42 బంతుల్లో 59, 8×4, 2×6) సందకన్‌ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

గేర్‌ మార్చిన గబ్బర్‌..
ఆరంభం నుంచి ఆచుతూచి ఆడిన గబ్బర్‌ ఇషాన్‌ ఔటయ్యాకా ఒక్కసారిగా గేర్‌మార్చాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడుతున్న ధావన్‌ (61 బంతుల్లో) అర్ధ సెంచరీ మార్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 33వ అర్ధ సెంచరీ, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (140) ఆరు వేల పరుగులు పూర్తి చేశాడు. ధావన్‌కు తోడు మనీష్‌ పాండే 26 పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుతిరిగాడు. మరో వికెట్‌ పడకూండా సూర్య కుమార్‌ యాదవ్‌ (30)తో కలిసి ధావన్‌ ( 94 బంతుల్లో 86 6×4,1×6) మిగతా లాంచనాన్ని కేవలం 36.4 ఓవర్లకే పూర్తి చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పృథ్వీషాకి దక్కింది.