Aug 07,2020 07:55

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచ ప్రజలందరినీ కలచివేసింది. పోర్టు వద్ద సంభవించిన రెండు భారీ పేలుళ్ల వల్ల కనీసం 135 మంది మృతి చెందగా, నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చు. పేలుళ్ల మూలంగా సుమారు 2,50,000 మంది నిరాశ్రయులయ్యారు. పేలుళ్ల ధాటికి నగరం యావత్తు అనేక భవనాలు కూలిపోవడం, లేదా ఎక్కువ భాగం నాశనమైంది. ప్రజలకు ఆహారం, మంచి నీరు, వసతి కల్పించడానికి అధికారులు తలమునకలవున్నారు. ఈ పేలుళ్లకు బీరుట్‌ పోర్ట్‌ వద్ద ఒక గోడౌన్‌లో నిల్వ చేసిన 2,700 టన్నుల అమ్మోనియం నైట్రైట్‌ కారణమని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మహమ్మద్‌ ఫాహ్మి తెలిపారు. ఆరేళ్ల క్రితం ఒక సరుకు రవాణా నౌక నుండి సీజ్‌ చేసిన రసాయనమది. పేలుళ్లకు ఉగ్రవాద చర్యలు కారణమా లేక ఇంకేమైనా వున్నాయా అన్న అంశంతోపాటు అంత భారీగా, ఇన్నేళ్లపాటు రసాయినాలను ఎందుకు నిల్వ చేశారన్నదీ ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. దోషులను గుర్తించి న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రధాని హసన్‌ దియాబ్‌ చెప్పారు. బీరుట్‌లో రెండు వారాల పాటు అత్యవసర పరిస్థితి విధించారు. పేలుళ్ల బాధిత లెబనాన్‌కు సహాయం చేయాలని ప్రధాని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో అనేక దేశాలు వెంటనే సానుభూతి, సంఘీభావం వ్యక్తం చేశాయి. ఇరాక్‌, ఖతార్‌ లెబనాన్‌కు వెనువెంటనే ఫీల్డ్‌ ఆసుపత్రులను తరలించాయి.
ఒకదాని తరువాత మరొకటిగా ఏదో ఒక సంక్షోభంతో ఇక్కట్లు పడుతున్న లెబనాన్‌లో ఈ పేలుడు సంభవించడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, తాజాగా కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేశాయి. తీవ్ర అవినీతిలో కూరుకుపోయి, ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చని ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీరుట్‌ వీధుల్లో జనం పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. పర్యవసానంగా నాటి ప్రధాని సాద్‌ రాజీనామా చేయవలసివ చ్చింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం ప్రధాన కర్తవ్యమైంది. అయితే, వివిధ కారణాల మూలంగా విత్త వ్యవస్థ ఇంకా దిగజారుతోంది. కరోనా మహమ్మారితో మరింత దెబ్బ తగిలింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది స్థూల జాతీయోత్పత్తి పన్నెండు శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. మరోవైపు మిలటరీ చర్యలకు దిగుతామని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరించడంతో దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్‌, హిజ్బుల్లాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అనేక ఇబ్బందుల మధ్యనున్న లెబనాన్‌కు ఈ పేలుళ్లలతో వెన్ను విరిగినంత పనైంది. ఈ విషణ్ణ నేపథ్యంలో వేలాది మంది క్షతగాత్రులను, లక్షల మంది నిరాశ్రయులనూ ఆదుకోవడం అందరి బాధ్యత. లెబనాన్‌లోని సున్నీ, షియా హిజ్బుల్లాలు అంతా ఉమ్మడిగా కృషి చేయాలి. వీలున్నంత త్వరగా ఆ దేశంలో సాధారణ స్థితి నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజమూ శక్తికొద్దీ తోడ్పాటునందించాలి.
బీరుట్‌ దుర్ఘటన మనకు కూడా ఒక హెచ్చరికే! మన దేశమంతటికీ అమ్మోనియం నైట్రేట్‌ ఎగుమతి, దిగుమతులు విశాఖ పోర్టు నుండే జరుగుతాయి. నిల్వ చేసే ప్రదేశం అటు పోర్టు, ఇటు విమానాశ్రయం, అంతకన్నా కీలకమైన తూర్పు నావికాదళ స్థావరం మధ్యలో వుండడం ఆందోళనకరమైన విషయం. చుట్టూ జనావాసాలు వుండంతో మరింత భయం కలుగుతోంది. ఇప్పటికే ఎల్‌.జి పాలిమర్స్‌ ప్రమాదం, ఆ తరువాత ఫార్మా సిటీ, సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలతో విశాఖ జిల్లా వాసులు భీతిల్లిపోతున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు నిబంధనలకు లోబడిన పరిమితిలో మాత్రమే అనుమతించాలి. పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేలా సంబంధిత అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు కనుక గోడౌన్లు జనావాసాలకు దూరంగా తరలించాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలి. నిపుణలతో వెంటనే తనిఖీలు చేపట్టాలి. విశాఖను పాలనా రాజధాని అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పొంచి వున్న ఈ ముప్పును గమనించి స్పందించాలి.