Feb 18,2022 06:57

మన దేశంలో 4-జి సేవలు ప్రారంభమై ఏడేళ్ళు గడిచిపోయాయి. కాని ఇంతవరకూ ఆ 4-జి సేవలను ప్రారంభించడానికి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు కేంద్రం అవకాశం ఇవ్వలేదు. మా సంస్థలోని ఉద్యోగులు, అధికారులు అందరూ ఏడేళ్ళ నుండీ 4-జి సేవలను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వమని పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు తక్కిన ప్రైవేటు కంపెనీలతోబాటు 5-జి సేవలను ప్రారంభించడానికి అనుమతించమని అడుగుతున్నాం. కాని ఈ ప్రభుత్వం మాత్రం మా విజ్ఞప్తిని పెడచెవిన పెడుతోంది. తన కన్న బిడ్డ లాంటి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు అన్యాయం చేస్తోంది.

   ప్రభుత్వ రంగ కంపెనీలతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలను ప్రైవేటు కంపెనీలకు కల్పించాలని నయా ఉదారవాద విధానాలను ఈ దేశంలో ప్రవేశపెడుతున్న సమయంలో ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ప్రధాని పి.వి. నరసింహారావు చెప్పారు. దీనినే 'లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌' అన్నారు. స్వంత లాభాల కోసమే వ్యాపారం చేసే ప్రైవేటు కంపెనీలను...ప్రజా సంక్షేమం కోసం, దేశ ప్రయోజనాల కోసం నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ఒకే గాటన కట్టడం దుర్మార్గం అని ఆనాడు కార్మిక సంఘాలు, వామపక్షాలు విమర్శించాయి.
    కాని ఇప్పుడు మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రమే అవకాశాలను కల్పిస్తూ, ప్రోత్సాహకాలను, రాయితీలను ఇస్తూ, వాటితో పోటీ పడడానికి వీలు లేని స్థితికి ప్రభుత్వ రంగ సంస్థలను నెట్టి వాటిని సమాధి చేయడానికి గోతులు తవ్వుతున్నారు. ఆనాడు చెప్పిన లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అయినా కల్పించమని ప్రభుత్వ రంగ సంస్థలు కోరుతున్నా, అనేక ఆంక్షలతో వాటి మెడలకు గుదిబండలు బిగిస్తున్నారు.
    నూరు శాతం ప్రభుత్వ వాటాలు ఉన్న బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష పూరిత వైఖరిని చూస్తే ఇదేదో మన దేశాన్ని దెబ్బ తీయాలనుకునేవాళ్ళు పన్నిన పన్నాగం అనిపిస్తుంది. కాని ఇది మన మోడీ గారి ''ఆత్మ నిర్భరత'' విధానం అన్నది పచ్చి నిజం !
   తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో టెలికం రంగంలో ఈ ఏడాది 5-జి సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఐతే ఆ సేవలు కేవలం ప్రైవేటు టెలికం కంపెనీల ద్వారా మాత్రమే అందుతాయని కూడా ఆమె తెలియజేశారు. మరి ప్రభుత్వ స్వంత సంస్థ అయిన బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ మాటేమిటి ?
    ''మన దేశంలో 4-జి సేవలు ప్రారంభమై ఏడేళ్ళు గడిచిపోయాయి. కాని ఇంతవరకూ ఆ 4-జి సేవలను ప్రారంభించడానికి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు కేంద్రం అవకాశం ఇవ్వలేదు. మా సంస్థలోని ఉద్యోగులు, అధికారులు అందరూ ఏడేళ్ళ నుండీ 4-జి సేవలను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వమని పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు తక్కిన ప్రైవేటు కంపెనీలతోబాటు 5-జి సేవలను ప్రారంభించడానికి అనుమతించమని అడుగుతున్నాం. కాని ఈ ప్రభుత్వం మాత్రం మా విజ్ఞప్తిని పెడచెవిన పెడుతోంది. తన కన్న బిడ్డ లాంటి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు అన్యాయం చేస్తోంది'' అని బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ సంఘాల నాయకులు వాపోతున్నారు.
 

                                        అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు

   2014లో మన దేశంలో 4-జి సేవలను ప్రారంభించారు. కాని కేంద్రం 4-జి స్పెక్ట్రంలో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు ఏ కేటాయింపూ చేయలేదు. ఉద్యోగ సంఘాలు, అధికారుల సంఘాలు దీర్ఘకాలం పాటు ఆందోళన చేశాక 2019 అక్టోబర్‌ లో అనుమతి లభించింది.
    బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ వద్ద 4-జి టెక్నాలజీకి అనువుగా ఉండే బి.టి.ఎస్‌ లు ( బేస్‌ ట్రాన్సీవర్‌ స్టేషన్స్‌) 49,300 ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయి 4-జి బిటిఎస్‌ లు గా అప్‌గ్రేడ్‌ చేస్తే దేశ వ్యాప్తంగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ 4-జి సేవలను అందించగలుగుతుంది. కాని ఆ విధంగా అప్‌గ్రేడ్‌ చేయడానికి కేంద్రం అనుమతి నిరాకరించింది. దాని వలన ఇప్పటి వరకూ బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ 4-జి సేవలను ప్రారంభించలేకపోయింది.
   ఉన్న బి.టి.ఎస్‌ లను అప్‌గ్రేడ్‌ చేయడానికి అనుమతి ఇవ్వలేదు కనుక మార్చి 2020లో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ 50,000 బి.టి.ఎస్‌ లను కొత్తగా కొనుగోలు చేయడానికి గ్లోబల్‌ టెండర్లను పిలిచింది. నోకియా, ఎరిక్‌సన్‌, సామ్‌సంగ్‌ వంటి కంపెనీలు మాత్రమే వీటిని సరఫరా చేయగల సామర్ధ్యం కలిగివున్నాయి. కాని, మోడీ ప్రభుత్వం మళ్ళీ అడ్డుపడింది. భారతదేశం లోని అమ్మకందారుల వద్దనుండి మాత్రమే వాటిని కొనుగోలు చేయాలన్న షరతు పెట్టింది. కాని భారతదేశంలో వాటిని సరఫరా చేయగలిగిన కంపెనీలు ఏవీ లేవు !
   ఇంకోపక్క ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌, ఐడియా వంటి కంపెనీలు గ్లోబల్‌ టెండర్ల ద్వారా వాటికి కావలసిన పరికరాలని కొనుగోలు చేసుకున్నాయి. ఆ కంపెనీల మీద ప్రభుత్వం ఎటువంటి షరతులనూ పెట్టలేదు. ఆ ప్రైవేటు కంపెనీలకు పోటీగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ రంగంలోకి దిగకుండా ఉండడానికే కేంద్ర ప్రభుత్వం తన స్వంత సంస్థ కాళ్ళు, చేతులు కట్టివేసింది. ఆ సంస్థలన్నీ ఇప్పుడు మొత్తం మార్కెట్‌ను ఆక్రమించుకుని ఉన్నాయి.
   ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు 4-జి సేవల కోసం కేంద్రం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు రూ. 44,720 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు ప్రకటించింది. తక్కిన కంపెనీలన్నీ 5-జి సర్వీసు ఇవ్వడానికి సిద్ధం అవుతూంటే బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ మాత్రం 4-జి కోసం ఇప్పుడు ఖర్చు చేయాలన్నమాట !
 

                                                         ఈ వివక్షత ఈనాటిది కాదు

నయా ఉదారవాద విధానాలు ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఈ వివక్షను ఎదుర్కుంటూనే వుంది. మన దేశంలో 1995లో మొబైల్‌ సేవలను ప్రారంభించారు. అప్పటికి డిఒటి గానే ప్రభుత్వ టెలికం విభాగం ఉండేది. 2000లో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ గా ఏర్పడింది. అక్టోబర్‌ 2002 నాటికి కాని బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు మొబైల్‌ సేవలను ప్రారంభించేందుకు అనుమతి రాలేదు. ప్రైవేటు సంస్థలు ఏడేళ్ళపాటు మార్కెట్‌ను ఆక్రమించుకున్నాకనే బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు అందులో అడుగు పెట్టడానికి అనుమతి ఇచ్చారు.
    మొబైల్‌ పరికరాలను కొనుగోలు చేయడానికి 2012 వరకూ బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు అనుమతి ఏదోవొక సాకుతో అప్పటి యు.పి.ఎ ప్రభుత్వం నిరాకరిస్తూనే వచ్చింది. ఆ కాలంలోనే దేశంలో మొబైల్‌ సేవల వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. కాని దాని ప్రయోజనం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు కేంద్రం దక్కనివ్వలేదు. దాని పర్యవసానంగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ నష్టాలలోకి జారిపోయింది. ఇంకా ఆనాటి నష్టాలు వెన్నాడుతూనే వున్నాయి.
   2010 లో 3-జి స్పెక్ట్రం వేలం వేశారు. కాని అందులో పాల్గొని 3-జి సేవలను ప్రారంభించడానికి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు 3-జి సేవలను ప్రారంభించే అవకాశం ఇచ్చినప్పుడు ప్రైవేటు కంపెనీలు ఏ ధర చెల్లించాయో దానితో సమానంగా చెల్లించమని షరతు పెట్టారు. నిజానికి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ స్వంత కంపెనీ గనుక దానినుంచి ఏ విధమైన రుసుమూ వసూలు చేయకూడదు. కాని కేంద్రం వసూలు చేసింది. దానితో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ దగ్గర ఉన్న మూల ధనంలో రూ. 10,000 కోట్లు తరలిపోయాయి.
ఇప్పుడు మళ్ళీ 5-జి సేవల విషయంలో కూడా ప్రైవేటు కంపెనీలకు మాత్రమే అనుమతినిచ్చారు.
 

                                                       కానివాళ్ళకి కంచాల్లో....

'అయినవాళ్ళకి ఆకుల్లో, కానివాళ్ళకి కంచాల్లో' అని మన సామెత ఉంది. అదేమాదిరిగా కేంద్రం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ను తొక్కిపట్టి వుంచడమే కాకుండా, ప్రైవేటు కంపెనీలను మాత్రం ఉదారంగా ఆదుకుంటోంది.
    ప్రైవేటు టెలికం కంపెనీలు ప్రభుత్వానికి ఇవ్వవలసిన రెవెన్యూ వాటా కింద బకాయిపడిన మొత్తం రు.1,69,000 కోట్లను చెల్లించాల్సిందేనని 2019 అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అందులో వొడాఫోన్‌ ఐడియా ఒక్కటే రూ.58,254 కోట్లు చెల్లించాలి. ఆ దెబ్బకి వొడాఫోన్‌ ఐడియా దివాలా తీసే స్థితికి చేరుకుంది. వెంటనే మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ బకాయిలను నాలుగేళ్ళపాటు వాయిదా వేసేసింది. ఆ తర్వాత కూడా వాయిదాల్లో చెల్లించవచ్చునని అనుమతినిచ్చేసింది. ఆ వాయిదాలను కూడా ఈక్విటీ కింద మార్చుకోవచ్చునని చెప్పింది. అంటే ఆ కంపెనీలో వాటాలను ప్రభుత్వం తీసుకుందన్నమాట. ఇటుపక్క స్వంత కంపెనీకి నిధులు, అనుమతులు, మార్కెట్టు లేకుండా చేసి అటువైపు వొడాఫోన్‌ ను ఆదుకోవడానికి ఎంతవరకైనా సిద్ధపడిపోయింది.
    ప్రభుత్వం నుండి ఇలా అనేక రూపాల్లో రాయితీలు పొందుతున్నా, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటివి ప్రజలను దోపిడీ చేస్తూనే వున్నాయి. 2021 నవంబర్‌ 26 నుండి తమ టారిఫ్‌ ను 25 శాతం ఒకేసారి పెంచివేశాయి. రిలయన్స్‌ జియో డిసెండర్‌ 1, 2021 నుండి తన టారిఫ్‌ ను 20 శాతం పెంచింది.
 

                                                    ఎన్ని ఒడిదుడుకులున్నా....

ఇన్ని విధాలుగా కేంద్రం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ను ఇక్కట్లపాలు చేస్తూన్నా, 2021 డిసెంబర్‌ నెలలో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ 23 లక్షల కొత్త మొబైల్‌ కస్టమర్లను చేర్చింది. జనవరి 2022లో 25 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చారు.
కేంద్రం తన తప్పుడు వైఖరిని విడనాడి, వివక్షను చూపకుండావుంటే బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఎంత బలంగా టెలికం మార్కెట్‌లో దూసుకుపోగలదో ఈ వాస్తవాలు వెల్లడి చేస్తున్నాయి.
   మోడీ గారి ఆత్మ నిర్భరత ఎంత మోసపూరిత నినాదమో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కుట్రపూరిత వైఖరి వెల్లడి చేస్తోంది.
   ఈ తరుణంలో దేశ ప్రజలంతా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు అండగా నిలబడి, మన జాతీయ టెలికం రంగాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సుబ్రమణ్యం