Nov 20,2020 06:59

కేంద్ర బిజెపి సర్కారు 2019 ఆగస్టు 5న రద్దు చేయడానికి ముందున్న జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్ర పున:ప్రతిష్ట, రాజ్యాంగంలోని 35(ఎ), 370 అధికరణాల పునరుద్ధరణ లక్ష్యంగా పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పిఎజిడి) ఏర్పడింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, సిపిఎం, సిపిఐ వంటి ఏడు రాజకీయ పార్టీలతో కూడిన కూటమి అది. భారత ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కలిగిన రాజ్యాంగబద్ధ పార్టీల కలయిక అది. ఆర్టికల్‌ 35, 370లను పునరుద్ధరించేందుకు అవసరమైన ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడానికి ఏర్పడిన ప్రజాస్వామ్య కూటమి అది. భారత రాజ్యాంగం జమ్ము-కాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని, అక్కడి స్థానికులకు ఆస్తి హక్కు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రక్షణలను కల్పించిన అధికరణాలే ఆ రెండూను. అలాంటి పిఎజిడి ని ఒక ముఠా (గుప్కార్‌ గ్యాంగ్‌)గా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభివర్ణించడం అత్యంత బాధ్యతా రాహిత్యం. వారు విదేశీ శక్తుల తోడ్పాటును కోరుతున్నారని షా మహనీయుడు నోరు పారేసుకోవడం దారుణం. 'మాది బిజెపి వ్యతిరేక వేదికే తప్ప జాతి వ్యతిరేక వేదిక కాద'ని కూటమి ఛైర్మన్‌, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా అంతకుముందే స్పష్టంగా ప్రకటించినా హోం మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు.


2019 ఆగస్టుకు ముందున్న జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్ర పున:ప్రతిష్ట తమ లక్ష్యంగా నిర్ణయించుకున్న సంస్థ ఆ రాష్ట్ర పతాకాన్ని తన చిహ్నంగా నిర్ణయించుకోవడం దాని చిత్తశుద్ధికి నిదర్శనం. ఆ పతాకాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏనాడో గుర్తించారు. ఇలాంటివి అర్ధం చేసుకోవలసింది పోయి పిఎజిడి కి జాతీయ పతాకమంటే గౌరవం లేదని తప్పుడు సూత్రీకరణలు చేయడం కమలనాథులకు తప్ప వేరెవరికీ సాధ్యం కాదు. ఒకవైపు జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు ప్రకటించి, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపుతూ గుప్కార్‌ కూటమి నేతల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని బిజెపి ప్రయోజనాల కోసం నిస్సిగ్గుగా వాడుకోవడం ఘోరం.


జమ్ము-కాశ్మీర్‌ను భారత్‌లో భాగం కానివ్వకుండా చేయాలని నాటి నుండి నేటి వరకు సామ్రాజ్యవాదులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు చేస్తున్నది, చెబుతున్నదీ ఆ వేర్పాటు వాదమే. జమ్ము కాశ్మీర్‌ ప్రజలు- ముఖ్యంగా యువతీ యువకులు - వేర్పాటువాద ప్రభావంలోకి వెళ్లకుండా భారత్‌లో కాశ్మీర్‌ అవిభాజ్య భాగంగా భావించేలా ప్రజలను భాగస్వాముల్ని చేయడం నేడెంతో అవసరం. బిజెపి సర్కారు అనుసరించిన విధానాల వల్ల వారు అంతకంతకూ భారత్‌కు మానసికంగా దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది. అది మారాలి... కాదు మార్చాలి. ఇందుకు గుప్కార్‌ కూటమి లాంటి శక్తులు, వారు సాగించే ఉద్యమాలు ఎంతగానో తోడ్పడతాయి.


ప్రజా కంటకుడైన మహారాజును బలపర్చడం మొదలు ఈ నాటి రాష్ట్ర విచ్ఛిత్తి వరకూ జమ్ము-కాశ్మీర్‌లో సంఘ పరివార్‌ది విద్వేష చరిత్రే! ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామాలయం, ఉమ్మడి సివిల్‌ కోడ్‌ అన్నవి కమల నాథుల దీర్ఘకాల వ్యూహాలు. వాటి ప్రాతిపదికనే దేశ వ్యాప్తంగా ప్రజల మధ్య చీలికలు తెస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తమ హిందూత్వ విధానాలను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలను నిట్ట నిలువునా చీల్చడమేగాక నర మేధానికి పాల్పడిన చరిత్ర వారిది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని బిజెపి జమ్ము-కాశ్మీర్‌లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తన విద్వేష క్రీడను సాగించడానికి జమ్ము-కాశ్మీర్‌ ప్రజలను సమిధలుగా మారుస్తోంది. దాన్ని ప్రశ్నించే దేశభక్తియుత శక్తులను అవహేళన చేయడం ఆ కుట్రలో భాగమే. పిజిడిఎ లో ప్రధాన భాగస్వామి అయిన పిడిపితో జట్టుగట్టి రెండేళ్లు పాలన సాగించినప్పుడు దేశభక్తియుతమైన పిడిపి ఇప్పుడే దేశ ద్రోహిగా మారిపోయిందా? ఇంతలోనే ఎంత మార్పు? ఇలాంటి అన్వయింపు లేదా ఊసరవెల్లి వైనం అమిత్‌ షా ముఠాకు మాత్రమే చెల్లుతుంది. జమ్ము-కాశ్మీర్‌ ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పునరుద్ధరణ ద్వారా మాత్రమే అక్కడి ప్రజల విశ్వాసాన్ని భారత యూనియన్‌ తిరిగి పొందగలదు. ఈ విషయంలో దేశ ప్రజలంతా జమ్ము-కాశ్మీర్‌ ప్రజలకు అండగా నిలవాలి.