Jul 26,2023 09:41

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు లైబ్రరీ భవనంలో బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాల 'ఇండియా' కూటమిపై తన అక్కసునంతా వెళ్లగక్కారు. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన... ప్రతిపక్షాల తీరు మారుతుందా..? అని ప్రశ్నించారు. గతంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందన్నారు. ఆఖరికి పిఎఫ్‌ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి దశ, దిశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు.
 

                                                                       రాహుల్‌ కౌంటర్‌

ప్రతిపక్షాలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఖండించారు.. మణిపూర్‌ గాయాన్ని నయం చేయడానికి తమ ప్రతిపక్ష కూటమి ఉందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానమని ఆయన స్పష్టం చేశారు. ''ప్రధాని గారూ.. మీరు ఎలా కావాలంటే అలా పిలుచుకోండి. మేము ఇండియా. మణిపూర్‌ గాయాన్ని నయం చేయడానికి, ప్రతి మహిళ, చిన్నారుల కన్నీరు తుడిచేందుకు మేము ప్రయత్నిస్తాము. ప్రజలందరి మధ్య ప్రేమ, శాంతిని, తిరిగి పాదుకొల్పుతాం. మణిపూర్‌లో భారతదేశ ఆత్మను పునరుద్ధరిస్తాం '' అని ట్వీట్‌ చేశారు.