సిడ్నీ : నివాసభవనాల వ్యయం, ఇంధనం ధర పెరిగిపోవడంతో ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం 32 ఏళ్ల గరిష్టానికి చేరింది. జులై -సెప్టెంబర్ నెలలో వార్షిక ధరల వృద్ధి రేటు 6.1 శాతం నుండి 7.3 శాతానికి చేరిందని, 1990 తర్వాత ఇదే అత్యధికం కాగా, వేతన వృద్ధి వేగానికి మూడురెట్లు అధికమని నిపుణులు పేర్కొన్నారు. ధరల పెరుగుదల దేశంలోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత దూకుడుగా పెంచడానికి దారితీసింది.
ఆస్ట్రేలియా బ్యూరోస్టాటిస్టిక్స్ (ఎబిఎస్) సమాచారం ప్రకారం... సెప్టెంబర్ త్రైమాసికంలో వినియోగదారుల ధరల సూచి (సిపిఐ) 1.8 శాతానికి ఎగబాకింది. మార్కెట్ నిపుణుల అంచనా 1.6 శాతంగా ఉంది.డిసెంబర్ త్రైమాసికంలో ప్రధాన ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకుంటుందని, సిపిఐ 7.75 శాతానికి చేరుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా (ఆర్‌బిఎ) అంచనా వేసినప్పటికీ.. అనూహ్య స్థాయిలో పెరుగుదలను ఊహించలేకపోయింది. అయితే సెప్టెంబర్‌లో ఎబిఎస్ కొత్త నెలవారీ సిపిఐ వేగవంతం కావడంతో ఈత్రైమాసికంలో కోర్, హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం రెండూ ఖచ్చితంగా పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
క్యూ4లో సిపిఐ ద్రవ్యోల్బణం 8 శాతానికి చేరుకోవచ్చని సీనియర్ ఆర్థికవేత్త ఒకరు హెచ్చరించారు. వినియోగదారుల ధరలలో ఊహించిన దానికంటే అధిక పెరుగుదల ఆర్‌బిఐ ఊహించిన దానికంటే దూకుడుగా వడ్డీ రేట్లు పెంచుతోందని అన్నారు.










