Sep 27,2023 13:05
  • సంగీతానికి అనుబంధ కోర్సులు నిర్వహించిన ఘనత ఏయూ సొంతం

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ఆడియో మ్యూజిక్ సంబంధిత కోర్సులను అందిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ప్రత్యేకతను నిలుపుకుంటోందని ప్రముఖ సంగీత దర్శకుడు, సౌండ్ ఇంజనీర్, గాయకుడు సన్నీ ఎం.ఆర్ అన్నారు. బుధవారం ఉదయం ఏయూలోని సెయింట్ లూక్స్ ఆడియో ఇంజనీరింగ్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడియో లాబ్, వీడియో ఎడిటింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ లను ఏయూ డైరెక్టర్ ఆచార్య కె. సమత రిజిస్త్రార్ ఆచార్య వి.కృష్ణ మోహన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సన్నీ మాట్లాడుతూ నేడు సంగీతానికి సంబంధించిన అనుబంధ రంగాలు ఎంతగానో అభివృద్ధి సాధిస్తున్నాయని, ఈ రంగంలో రాణించాలని భావించే యువతకు ఆంధ్ర విశ్వవిద్యాలయం- సెయింట్ లూక్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అధునాతన రికార్డింగ్ స్టూడియో ల్యాబ్ వారు అందించే శిక్షణ ఎంతో ఉపయోగంగా నిలుస్తుందని అన్నారు. నేడు మీడియా రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నాయని చెప్పారు. ఏయూ రిజిస్టర్ ఆచార్య వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో పేర్కొన్న విధంగా విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా ప్రోత్సహిస్తూ, వారి సమగ్ర వికాసానికి దోహదపడే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పనిచేస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా వీడియో ఎడిటింగ్, సౌండ్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులను అందిస్తున్నామని అన్నారు. ఆధునిక లేబరేటరీ, స్టూడియో వంటి వసతులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యక్షంగా శిక్షణ అందిస్తూ ఈ రంగంలో వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య కె. సమత,సంగీత దర్శకులు ఏయూ- సెయింట్ లూక్స్ ఆడియో ఇంజనీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ కేంద్రం నిర్వాహకులు ఆశీర్వాద్ లూక్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ ఎం.జేమ్స్ స్టీఫెన్, ప్రవేశాల సంచాలకులు ఆచార్య డిఏ నాయుడు, ఆచార్య టి శోభశ్రీ , ఏయూ సంగీత విభాగాధిపతి ఆచార్య ఏ.అనురాధ, సరస్వతి విద్యార్థి పలువురు ఆచార్యులు ఉద్యోగులు పాల్గొన్నారు.