Jul 18,2021 15:05

తిరుపతి : అష్టావధాన ప్రక్రియ తెలుగు భాషకు ఎంతో ప్రత్యేకమని, శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు. తిరుపతి నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన చతుర్గుణిత అష్టావధానంలో జస్టిస్‌ ఎన్‌వి రమణ పాల్గొన్నారు. అవధాని మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని రమణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జ్ఞాపక శక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అష్టావధానం అని అన్నారు. మాతృ భాష, జాతి ఔన్నత్యానికి అష్టావధానం ప్రతీక అన్నారు. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురభిమాని కాదని, మధురమైన తెలుగుభాషను భావితరాలకు అందించాలని పేర్కొన్నారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తోందని, తెలుగు భాషకు ఆదరణ తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలిపారు. సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలన్నారు. సాహిత్య రూపం కనుమరుగైతే తిరిగి సృష్టించలేమని, సాహితీ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా మార్పు చేసుకోవాలని తెలిపారు. సాహితీ సేవలో తన వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని వివరించారు.