Feb 14,2023 21:14

నినాదాలుచేస్తున్న ఆశావర్కర్లు

నినాదాలుచేస్తున్న ఆశావర్కర్లు
'ఆశా'లపై శ్రమదోపిడీ
నెల్లూరు:కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ గౌరవ వేతనం పేరుతో 'ఆశా' వర్కర్స్‌ శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు అందజేయాలని ఏపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఏపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆశాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆశాలకు రూ.26 వేలు కనీస వేతనంగా అందజేయాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం రూ. 10 వేలు మాత్రమే ఇస్తూ అడ్డమైన పనులన్నీ చేయిస్తూ మానసిక వత్తిడికి గురిచేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆశాలపై రాజకీయ వేదింపులు అధికమైపోయాయని, ఈ వేదింపులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకొని ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.
కొవిడ్‌ సమయంలో కరోనా బాధితులకు సేవలందించి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలను సైతం వదిలేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారన్నారు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలను ఫ్రంటులైన్‌ వారియర్స్‌ గుర్తించినప్పటికీ విధి నిర్వాహణలో కరోనా బారిన పడి మరణించిన ఆశాల కుటుంబాలకు కేంద్రంగాని రాష్ట్రంగాని ఎలాంటి ఆర్ధిక సహాయసహకారాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తపరచారు. జిల్లా అధ్యక్షరాలు కె. విజయలక్ష్మి మాట్లాడుతూ ఆశాలను కార్మికులుగా గుర్తించి. రిటైర్మెంటు బెనిఫిట్స్‌ ఇవ్వాలని, రూ. 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా అందజేయాలని,ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంటు వయస్సు 62 సంవలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు టి.వి.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవచేస్తూ ప్రభుత్వనికి ఎంతో మంచిపేరు తెస్తున్న ఆశాలను ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. వైసిపి నాయకులు రాజకీయ వేదింపులకు గురిచేస్తూ అనేక మంది ఆశాలు ఇబ్బంది పడుతున్నారని అందులో బాగమే గండిపాళెం పి.హెచ్‌.సి. ఆశా వర్కర్‌ జి. శ్రీవాణి జనవరి నెల వేతనం రాలేదని ఆందోళన వ్యక్తపరచారు. ఆశాలు చేసే పోరాటానికి సి.ఐ.టి.యు. అండగా వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ .మధుశోభన, పి.భాగ్యరేఖ, సుజాత, భువనేశ్వరి,ఈ.సుభాషిణి, నారాయణమ్మ, ధనమ్మ, రమణమ్మ,పి.కృష్ణమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.