Mar 24,2023 20:52

ఆశాల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

రాయచోటి టౌన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అన్నమయ్య జిల్లా డిఎంహెచ్‌ఒ కార్యాలయం వద్ద ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆశాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆశ వర్కర్లు గత 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు, శిశువులకు, ఆరోగ్య సేవలు అందించడంలో ఎనలేని కషి చేస్తున్నా, వీరి సంక్షేమం ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సచివాలయాలకు ఆశాల్ని మ్యాపింగ్‌ చేసే క్రమంలో పని భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రకరకాల సర్వేల పేరుతో, సంవత్సరానికి 30 రికార్డులు రాయిస్తున్నారని, వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు ఆశా వర్కర్లే భరించాల్సి వస్తుందని ఆయన వాపోయారు. వ్యాక్సిన్‌ క్యారియర్లు, మందులు పిహెచ్‌సి నుండి తీసుకురావాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదే అని అధికారులు చెప్పడం వల్ల, వచ్చే వేతనంలో సగం రవాణా ఛార్జీలకు ఖర్చవుతుందని తెలిపారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదని వాపోయారు. చివరికి భర్త చనిపోతే ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యం.జయమ్మ మాట్లాడుతూ ఎన్‌సిడిసిడి, లెప్రసీ సర్వేలు, ఆన్‌లైన్‌ చేసే పని ఆశా వర్కర్లది కాకపోయినా వారిత చేయించడం దారుణమని వాపోయారు. స్మార్ట్‌ ఫోన్లు నాణ్యమైనవి ఇవ్వకపోవడంతో అవి పని చేయట్లేదని చెప్పారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.రామచంద్ర ఆశాలకు మద్దతు తెలియజేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని, ఆశాలకు సంబంధం లేని పనులు చేయక్కరలేదని, సేకరించిన శాంపిల్స్‌ ఆశాలు పిహెచ్‌సి లకు అప్పగించవసరం లేదని, వైఎస్‌ఆర్‌ క్లినిక్‌ లకు అప్పగిస్తే సరిపోతుందని తెలిపారు. ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి యూనియన్‌ నాయకత్వంతో జాయింట్‌ సమావేశం ఎర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రమామణి, సుహాసిని, సుజాత, నిర్మల, లక్ష్మీ ప్రసన్న, అమరావతి, రేణుక, అరుణ, రమాదేవి పాల్గొన్నారు.
- డిఎంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలు