Mar 21,2023 20:28

- మాట్లాడుతున్న ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు

 రాయచోటి టౌన్‌ : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 24న అన్నమయ్య జిల్లా డిఎంహెచ్‌ఒ కార్యాలయం వద్ద నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు పి.శ్రీనివాసులు, సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు అధికమవుతున్నాయని చెప్పారు. వారి పనిభారంపై పెరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆశావర్కర్లతో సంబంధం లేని పనులు చేయించ రాదని చెప్పారు. ఆశావర్కర్ల నియామకాలు ప్రభుత్వమే నిర్వహించాలని, వేధింపులు, అక్రమ తొలగింపులు, రాజకీయ జోక్యం ఆపాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు ఆశావర్కర్ల నియామకాల్లో ప్రధాన్యత కల్పించాలని చెప్పారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయ విధులు, ఆశావర్కర్లతో చేయించరాదని పేర్కొన్నారు. ఆశా వర్కర్లకు సెలవులు మంజూరు చేసి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూపు ఇన్సురెన్సు కల్పించాలన్నారు. రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. 104 ఉద్యోగుల కోసం ఆశా వర్కర్లతో ఎలాంటి అదనపు ఖర్చులు చేయించరాదని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎ.ముంతాజ్‌ మాట్లాడుతూ ఆశాలకు ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేని పేర్కొన్నారు. సచివాలయంతో సంబంధం లేకపోయినా సాయంత్రం వరకు సచివాలయంలో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో స్ధానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం 24న జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆశా నాయకురాలు రమాదేవి, సత్యవాణి, సంగీత, రోజా, జహరాబి పాల్గొన్నారు.