- సిపిఎస్‌ను ప్రతిపాదించిన పిఆర్‌సి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశపడ్డ ఆర్‌టిసి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఒకపక్క సిపిఎస్‌ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ నూతన పిఆర్‌సి నివేదిక సారాంశంలో మాత్రం ఉద్యోగులు 1995 నాటి ఇపిఎస్‌నుగానీ, కొత్తగా వచ్చిన సిపిఎస్‌లోగానీ చేరాలని ప్రతిపాదించారు. ఉద్యోగులందరికీ రెండు అంచల్లో వేతనాలు నిర్థారించాలని తెలిపారు. 2018 జులై ఒకటో తేదీ నాటికి ఒకసారి, మరలా 2020 జనవరి ఒకటోతేదీ నాటికి రీఫిక్స్ చేయాలని సూచించారు. అలాగే 2018 నాటికి ఉన్న మూలవేతనంపై 1.6 శాతం ఫిట్‌మెంట్ కలపాలని సూచించారు. డిఏ, హెచ్‌ఆర్‌ఏ, సిసిఏ 2020 జనవరి నుండి అమలు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ వస్తుందని ఆశపడ్డ ఆర్‌టిసి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. దీంతోపాటు పిఆర్‌సి వల్ల ఎవరికైనా వేతనంలో తగ్గుదల అనిపిస్తే వారికి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు.
కేంద్రం మోసం చేసింది
విభజన అనంతరం రాష్ట్రానికి ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణా నుండి రావాల్సిన నిధులను ఇప్పించడంలో కేంద్రం మోసం చేసిందని నివేదికలో పొందుపరిచారు. తెలంగాణాలో సుమారు లక్షకోట్ల విలువైన ఆస్తులు వదిలేసుకున్నామని, కోవిడ్ వల్ల రూ.20వేల కోట్లనష్టం వచ్చిందని పేర్కొన్నారు. హైదరా బాద్ నగరాన్ని వదులుకోవడం తీవ్రమైన ఆర్థికలోటుకు కారణమైందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం వ్యవసాయ ఆధారితం అవడం వల్ల ఆదాయంలోనూ పెద్దగా పెరుగుదలేదని తెలిపారు. తెలంగాణా నుండి రూ.6284 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. రెవెన్యూలోటు రూ.22,948 కోట్లు ఉంటే కేంద్రం రూ.3979 కోట్లు ఇచ్చిచేతులు దులుపుకుందని వివరించారు. రామయపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు లేకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని వివరించారు.










