ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్ : రాజీవ్‌నగర్‌లోని ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగు పర్చాలని, మహిళా డాక్టర్ ను కేటాయించాలని కోరుతూ ఐద్వా, డి.వై.యఫ్.ఐ సెంట్రల్ సిటీ కమిటీ ల ఆధ్వర్యంలో నిరసన గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి, సెంట్రల్ కార్యదర్శి జి. ఝాన్సీ, డివైఎఫ్‌ఐ సెంట్రల్ కార్యదర్శి యస్. కె. నిజాంలు మాట్లాడుతూ సుమారు లక్ష మంది వరకూ పేద , మధ్య తరగతి కి చెందిన ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో గర్భిణీల కాన్పుల కోసం ఉన్న ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. కాన్పుల కోసం వేలమంది మహిళలు ఈ ఆసుపత్రికి వస్తుంటే మహిళా డాక్టర్ లేకపోవడం, గత రెండు సంవత్సరాలుగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం పట్ల కార్పొరేషన్, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి తెలుస్తుందని అన్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అరుణ జ్యోతి అనే మహిళ తన బిడ్డను కోల్పోయిందని , గతంలో కూడా హాస్పిటల్ అంబులెన్స్ లేక ఆటోలోనే మహిళలు డెలివరీ అయిన సంఘటనలు కూడా జరిగాయని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ, ప్రభుత్వం బాధ్యత వహించి పేదవారైన అరుణ జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలని , మహిళా గైనకాలజిస్టును నియమించాలని , ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్‌ఐ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు శివ , రసూల్, దేవీకుమారి , అమ్ములు , నిర్మల , అరుణ, సావిత్రి, పార్వతి, ప్రజాసంఘాల బాధ్యులు సి.హెచ్. శ్రీ ను , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










