ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సెలింగ్‌ను మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో బి-ఫార్మ, డి-ఫార్మలో సీట్ల భర్తీకి సంబం ధించిన కౌన్సెలింగ్ నిర్వహణ జాప్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల అసోసియేషన్‌తోపాటు కొన్ని కళాశాలలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని కళాశాల లకూ మూడు వారాల్లోపు కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఎపి ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్, ఇఎపిసెట్ కన్వీనర్, జెఎన్‌టియు కాకినాడ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కళాశాలల వారీ సీట్లకు ఫార్మసీ కౌన్సెలింగ్ ఆఫ్ ఇండియా (పిసిఐ) అనుమతివ్వాలి. ఈ అనుమతి లేకపోవడం తో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశాల పరీక్ష (ఇఎపిసెట్) కన్వీనర్ కౌన్సెలింగ్ తేదీలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో కౌన్సెలింగ్ నిర్వహణ కోసం విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతియేటా అక్టోబరు నాటికి కౌన్సెలింగ్ పూర్తయి తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో సుమారు 193 ఫార్మ కళాశాలలు ఉండగా, దాదాపు 11 వేల సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. పిసిఐ అనుమతులు జారీ జాప్యం కావడంతో ఇప్పటి వరకు కనీసం తేదీలను కూడా ఉన్నత విద్యాశాఖ ప్రకటించలేకపోయింది. కళాశాలలు వ్యక్తిగతంగా పిసిఐ నుంచి అనుమతులు తీసు కోవాలని ఇఎపిసెట్ కన్వీనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనుమతులు కోసం కళాశాలలు కోర్టు ను ఆశ్రయించాయి. హైకోర్టు తీర్పు పట్ల కళాశాలల అసోసియేషన్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
- కళాశాలల ఫీజులు పెంపు
కళాశాలలు చెల్లించే ఫీజును పిసిఐ భారీగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం ఈ అంశంపై చర్చించలేదు. కోర్సులను బట్టి కళాశాలల ఫీజులు మారుతాయి. ఉదాహరణకు గతంలో రూ.2 లక్షలు ఉన్న ఫీజును రూ.8 లక్షలకు పెంచింది. ఈ ఫీజులను తగ్గించాలని పిసిఐకు ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ పలుమార్లు లేఖలు రాసింది. అయినా స్పందన లేకపోవడంతో ఫీజుల పెంపు అంశంపై అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశం కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు తీర్పు వచ్చే వరకు పాత ఫీజులనే అనుమతించాలని ఇటీవల కోర్టు తెలిపింది.
- లాసెట్‌కు రాని అనుమతి
రాష్ట్రంలో లా సీట్ల వివరాలను కూడా బార్ కౌన్సెలింగ్ ఆఫ్ ఇండియా (బిసిఐ) వెల్లడించలేదు. దీంతో లాసెట్-2023 కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్య ప్రకటించలేదు. లాసెట్ కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షకు సుమారు 15 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.










