Sep 16,2023 21:54

ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి సిఐ వి.గిరి బాబు

అనుమతులు తప్పనిసరి
ప్రజాశక్తి-సీతారామపురం : వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రదేశాలలో పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఉదయగిరి సిఐ వి.గిరి బాబు తెలిపారు. శనివారం మండలంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు నిర్వహించేవారు పూర్తి చిరునామాతో పోలీస్‌ స్టేషన్‌లో దరఖాస్తును నింపి పోలీస్‌ అనుమతి తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ, విద్యుత్‌ శాఖల అనుమతి కూడా తీసుకోవాలన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే కమిటీ సభ్యులదే పూర్తి బాధ్యత అన్నారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు తప్ప మరి ఏ ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. నిమజ్జనం సమయంలో నీటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. ఆయనవెంట ఉదయగిరి ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.