Aug 17,2022 23:36

  • తీవ్ర రక్తస్రావానికి గురైన మహిళకు తప్పిన ప్రాణాపాయం

ప్రజాశక్తి-హెల్త్‌యూనివర్సిటీ: అను ఇనిస్టిట్యూట్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ మానం భవానీశంకర్‌ అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన రక్తస్రావంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న 27 ఏళ్ల మహిళకు అత్యాధునిక ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ పద్ధతిలో చికిత్స చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఎనికేపాడులోని అను ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో అను గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సీఈవో డాక్టర్‌ జి.రమేష్‌ మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్‌ భవానీశంకర్‌ బృందాన్ని అభినందించారు. భవానీశంకర్‌ మాట్లాడుతూ గతంలో రెండుసార్లు గర్భస్రావం కావడంతో పాటు, రక్తనాళాలు అసాధారణంగా మారడంతో మహిళకు అత్యంత తీవ్రస్థాయిలో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించామని చెప్పారు. హిమోగ్లోబిన్‌ శాతం ఆరుకు చేరుకోవడంతో మహిళ ఆరోగ్యం విషమించిందని అన్నారు. మహిళ భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలను దష్టిలో ఉంచుకుని, గర్భాశయం తొలగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. యుటరిన్‌ ఆర్టెరీ ఎంబోలిజేషన్‌గా పిలువబడే ఈ సమస్యకు ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ చికిత్స అత్యుత్తమమైనదిగా భావించి చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. ఎటువంటి గాట్లు లేకుండా ఏవీ మాల్ఫార్మేషన్‌ చికిత్స చేయగలిగామని వివరించారు. చికిత్స అనంతరం కేవలం నాలుగు రోజుల్లోనే రోగి కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.