Mar 20,2023 19:05

సమావేశంలో మాట్లాడుతున్న వేణుగోపాల్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : వైసిపి అధికార బలంతో అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తోందని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌ అన్నారు. సోమవారం స్థానిక టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన డబ్బులను తల్లులు ఖాతాలో వేస్తూ బటన్‌ నొక్కారని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు డబ్బులు తమ ఖాతాలో జమ కాలేదన్నారు. అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం పూర్తి స్థాయి ఫీజును కడితేనే పరీక్ష ఫీజులు కట్టించుకుంటామని సర్కులర్‌ పంపించారన్నారు. ఆ సర్కులర్లో మార్చి 24వ తేదీలోపు కట్టకపోతే రూ.3 వేలు అపరాధ రుసుంతో కట్టాలని సర్కులర్‌ ఇవ్వడం చాలా దారుణమన్నారు. కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌ మీదే ఆధారపడి ఉంటారని తెలిపారు. వారిని రీయింబర్స్‌మెంట్‌ రాకుండా ఫీజులు కట్టమంటే ఏ విధంగా కడతారని ప్రశ్నించారు. కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా విద్యా దీవెన డబ్బులు రాకుండా కళాశాలకు డబ్బులు కట్టవలసిన అవసరం లేదన్నారు. అలా కాదని కలాశాల యాజమాన్యాలు వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు అనునిత్యం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అండగా ఉంటుందని తెలియజేశారు. కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థులను ఫీజులు కోసం వేధించొద్దని కళాశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాజంపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి సాయి, ప్రసాద్‌, నాయకులు హరీష్‌ పాల్గొన్నారు.