ప్రజాశక్తి- కలక్టరేట్
దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎలాంటి కష్టం రాకుండా, వారికి ఉత్పన్నమయ్యే సమస్యలను అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. సోమవారం స్పందన సమావేశపు హాల్లో ఆయన జిల్లా వ్యవసాయ సలహా మండలి బోర్డు సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖలు వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనశాఖలకు సంబంధించిన వివిధ అంశాల పై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టి రైతుకు ఎదుర య్యే సమస్యలకు అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం అందించాలన్నారు. రైతులు వాడవలసిన పురుగు మందులు, ఎరువులు, సీజన్కు అనువైన వరివంగడాలు, సాముహిక ఎలుకల నివారణ, నీటియాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు, మైక్లతో ప్రచారం, కరపత్రాలు ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ప్రయివేటు వ్యక్తులు అంటగట్టే నాసిరకం ఎరువులు, పురుగుమందుల నుండి రైతులను కాపాడవచ్చని తెలిపారు. ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులను అందు బాటులో ఉంచాలన్నారు. అదే విధంగా ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయలన్నారు. రైతులకు రుణాలు, సీసీఆర్ సి కార్డుల మంజూరు, ఉచిత క్రాప్ ఇన్సూరెన్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయశాఖ వారి సాముహిక ఎలుకుల నివారణ విధానంపై పోస్టరును ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి బోర్డు ఛైర్మన్ జన్ను రాఘవరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ వై.వి.ఎస్. మనోహరరావు, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి చంద్రశేఖరరావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారిణి జె. జ్యోతి, వ్యవసాయశాఖ ఎడి మణిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.










