ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వం చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఐసిడిఎస్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. ముఖ హాజరు రద్దు చేయాలన్నారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని పేర్కొన్నారు. గ్యాస్ బండ ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి ఐదేళ్లకు పెంచాలన్నారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని పేర్కొన్నారు. 300 జనాభా దాటిన మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాలన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేయాలని, అంగన్వాడీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి భీమా అమలు చేయాలన్నారు. ర్యాలీలు, సభలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ నెంబర్ ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శిరీష, అన్నపూర్ణమ్మ, షకీలాభాను, రాజేశ్వరి, వనిత, సునీత, లావణ్య, మమత, అనురాధ, ఈశ్వరమ్మ, విజయమ్మ, అమరావతి పాల్గొన్నారు.










