అమెరికా : 18 ఏళ్ల తరువాత మళ్లీ అమెరికాలో అరుదైన వ్యాధి కనిపించింది. 2003 వ సంవత్సరంలో అమెరికాలో అరుదైన మంకీఫాక్స్ కేసులు విస్తరించాయి. కొన్నాళ్లకు ఆ వ్యాధి కేసులు పూర్తిగా మాయమయ్యాయి. అరుదైన వ్యాధుల జాబితాలో దీన్ని చేర్చారు. మధ్య, పశ్చిమ మధ్య ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఈ వైరస్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు మళ్లీ ఆ వ్యాధి బయటపడటంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రస్తుతం ఒక్కరిలో మాత్రమే ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు.
టెక్సాస్‌కు చెందిన వ్యక్తిలో లక్షణాలు..
ఇటీవలే టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి నైజీరియాకు వెళ్లి వచ్చాడు. అతనిలో ఈ మంకీఫాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తిని డాలస్‌లోని ఆసుపత్రిలో వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. జులై 8, 9 తేదీల్లో నైజీరియా నుంచి రాకపోకలు సాగించిన ఆ వ్యక్తి వివరాలు, బాధితునితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగమయ్యారు.
వ్యాధి ఎలా వస్తుందంటే..
మంకీఫాక్స్ అనే వైరస్ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది. కోతులు, ఎలుకల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శరీరంపై దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి 2 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది.










