Aug 27,2020 08:24


కోవిడ్‌- 19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్‌ వల్ల ఇతర ఆరోగ్య సేవలు నిలిచిపోవడంతో మహిళలు మరింత విధ్వం సకర స్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఒకటి, రెండేళ్ల లో పరిస్థితులు మెరుగయ్యేలా లేవు. ఈ సందర్భంలోనే ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని... లైంగిక, పునరు త్పత్తికి సంబంధించిన ఆరోగ్య సేవలను తప్పనిసరిగా కొనసాగించాలని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' స్పష్టం చేసింది. కాని ఆ మార్గదర్శకాలను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టాయి.
అనేక దేశాలు కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ ఆంక్షలను సుదీర్ఘకాలంగా కొనసా గిస్తున్నాయి. వాటిలో భాగంగా కోవిడ్‌ పరీక్షలు మినహా మిగిలిన అన్ని ఆరోగ్య అత్యవసర విభాగాలను మూసివేశాయి. దాంతో మహిళల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. అంతేకాక మహిళలపై శారీరక, మానసిక హింస ఈ కాలంలోనే పెరిగిపోవడమూ చూస్తున్నాం. ఈ కోవిడ్‌ కాలం మహిళల పాలిట విధ్వంసకాలంగా మారిందని 'యు.ఎన్‌ పాపులేషన్‌ ఫండ్‌' (యుఎన్‌ఎఫ్‌పిఎ) ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ నటాలియా కానెం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'ప్రస్తుతం మహిళలు నిరాశ, నిస్పృహకర పరిస్థితుల్లో ఉన్నారు. దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సమాజాన్ని బట్టి ఈ హింస రూపం మారవచ్చేమో కాని, ఎక్కడైనా సరే మహిళలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి అదే. అయితే ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు' అంటున్నారామె.
ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది అవాంఛిత గర్భం దాల్చవచ్చని, వాటి నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాల్లో (అసురక్షిత గర్భస్రావాలు, క్లిష్టమైన ప్రసవాలు) భాగంగా అనేకమంది మహిళలు మరణించవచ్చని యుఎన్‌ఎఫ్‌పిఎ అంచనా వేసింది. 37 దేశాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న 'మేరీ స్టోప్స్‌ ఇంటర్‌నేషనల్‌' (ఎంఎస్‌ఐ) లాక్‌డౌన్‌ కారణంగా సేవలను నిలిపివేసింది. దీనివల్ల గర్భనిరోధక సాధనాలు అందుబాటులో లేకపోవడంతో...ఆరోగ్య సేవలు అవసరమైన 95 లక్షల మంది మహిళలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 27 లక్షల మంది అసురక్షిత గర్భస్రావాలకు పాల్పడ్డారు. వివిధ రకాల గర్భధారణ సమస్యలతో 11,000 మంది మరణించారు. రవాణా సదుపాయాలు నిలిచిపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం.
ప్రస్తుతం కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ నిబం ధనలను సడలించారు. ప్రైవేటు క్లినిక్కులు, స్థానిక ఆసుపత్రుల్లో ఇతర ఆరోగ్య సేవలకు అనుమతులు ఇచ్చారు. అయితే జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. మన దేశంలో లక్షలాది మహిళలు గర్భనిరోధక సేవలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంఎస్‌ఐ అనుబంధ సంస్థ 'ఫౌండేషన్‌ ఫర్‌ రీప్రొడక్టివ్‌ హెల్త్‌ సర్వీస్‌ ఇండియా' అంచనా ప్రకారం లాక్‌డౌన్‌ కారణంగా మన దేశంలో రెండు కోట్లా 60 లక్షల మంది మహిళలు గర్భనిరోధక సాధనాలను సకాలంలో పొందలేకపోయారు. దీంతో 23 లక్షల అవాంఛిత గర్భాలకు, 8 లక్షలకు పైగా అసురక్షిత గర్భస్రావాలకు దారితీసింది. ఈ గణాంకాలే మాతా శిశు మరణాలలో మన దేశాన్ని ప్రపంచంలో మూడవ స్థానానికి దిగజార్చాయి.
లాక్‌డౌన్‌ కాలంలో అనేక దేశాలు టెలీ మెడిసిన్‌ను అందుబాటు లోకి తీసుకు వచ్చాయి. మన దేశంలో కూడా అక్కడక్కడా ఆ పద్ధతిని అవలంబిస్తున్నారు. కానీ మారు మూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన జీవించే మహిళలకు ఆ సేవలు అందు బాటులో ఉండవు. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా లేని పల్లెలు ఎన్నో ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.
( ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ )