Jan 06,2021 17:30

వాషింగ్టన్‌ : బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ ఇప్పటికే 41 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ప్రకటించింది. బ్రిటన్‌లో బయటపడిన కోవ్‌ 202012/01 రకం కరోనా వైరస్‌ ఈ నెల 5 నాటికి 40 దేశాలకు, దక్షిణాఫ్రికాలోని 501. వి2 రకం వైరస్‌ ఆరు దేశాలకు వ్యాప్తిచెందిందని డబ్ల్యుహెచ్‌ఒ వెల్లడించింది. సార్స్‌ కోవ్‌-2తో పోలిస్తే బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌ 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. కరోనాలో బ్రిటన్‌ రకం వైరస్‌ కాకుండా మరో నాలుగు రకాల వైరస్‌లను గుర్తించినట్లు డబ్ల్యుహెచ్‌ఒ ప్రకటించింది. వాటిలో దక్షిణాఫ్రికా కరోనా వైరస్‌ కాకుండా గతంలో వచ్చిన డి614జి రకం కూడా ఉంది. మరోవైపు భారత్‌లో కూడా స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 71 కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.