Jan 20,2021 20:33

న్యూయార్క్‌ : బ్రిటన్‌లో కొత్తగా వెలుగుచూసిన కరోనా వైరస్‌ వేరియంట్‌ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం 60దేశాల్లో ఈ వైరస్‌ వున్నట్లు కనుగొన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) బుధవారం తెలిపింది. వారం రోజుల క్రితంతో పోలిస్తే పది దేశాల్లో కొత్తగా ఈ వైరస్‌ విస్తరించింది. ప్రస్తుతం కరోనా మరణాలు ప్రపంచవ్యాప్తంగా 20లక్షలు దాటగా, కొత్త వైరస్‌ వేరియంట్‌ తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్లు విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చేవరకు ఈ ఇన్ఫెక్షన్లను తగ్గించేలా చేయడమెలా అని ప్రపంచ దేశాలన్నీ తలబద్దలు కొట్టుకుంటున్నాయి. గత వారం రోజుల్లో కొత్త మరణాలు రికార్డు స్థాయిలో 93వేలు వుండగా, 47లక్షల కొత్త కేసులు దాఖలయ్యాయి. డిసెంబరు మధ్యలో తొలిసారిగా ఈ కొత్త వైరస్‌ను బ్రిటన్‌లో కనుగొన్నారు. ఒరిజినల్‌ వైరస్‌ కన్నా ఇది 50నుండి 70శాతం ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ను గుర్తించి పోరాడేలా ప్రస్తుతం చాలా వ్యాక్సిన్లను రూపొందించారు. వైరస్‌ ఇలా జన్యుపరంగా మార్పులు చెందడానికి వ్యతిరకంగా తమ వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తాయని ఫైజర్‌, జర్మనీ భాగస్వామి బయో ఎన్‌ టెక్‌ తెలిపాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ క్రమం కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ మహమ్మారిని అదుపు చేయగలమని భావిస్తున్నారు. అయితే భారత్‌, రష్యాలతో సహా పలు ఇయు దేశాలు, ఇతర దేశాలు ఇంకా తమ టీకా కార్యక్రమం పూర్తి స్థాయిలో చేపట్టేందుకు కృషి చేస్తున్నాయి.