జెనీవా : బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్స్ అనేక దేశాలలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 25 నాటికి బ్రిటన్ వైరస్ 70 దేశాలకు వ్యాపించిందని యుఎన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. విఒసి 202012/01 అని పిలిచే ఈ వేరియంట్ సులభంగా ఇతరులకు సోకుతుందని, వారం రోజుల వ్యవధిలో మరో పది దేశాలకు వ్యాపించిందని ప్రకటించింది. ఇదే అంశంపై బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా గతవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా అధ్యయనాలు ఈ వైరస్ మరింత ప్రాణాంతకమని సూచించాయి. ఈ ఫలితాలు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా వెల్లడించామని, వీటిని ధృవీకరించేందుక మరిన్ని విశ్లేషణలు అవసరమని జాన్సన్ పేర్కొన్నారు. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన కొత్త వేరియంట్ 31 దేశాలకు వ్యాపించిందని, వారం రోజుల్లో ఎనిమిది దేశాలకు సోకిందని పేర్కొంది. 501 వై. వి2గా పిలిచే ఈ వైరస్ వ్యాధినిరోధక శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలిపింది. ఈ వేరియంట్ రీ ఇన్‌ఫెక్షన్ అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని, వ్యాక్సిన్‌ల ప్రభావానికి కూడా ఆటంకం కలిగిస్తోందని హెచ్చరించింది. మరిన్ని అధ్యయనాలు అవసరమని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరించింది. బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చిన పి1 వేరియంట్ ఎనిమిది దేశాలకు విస్తరించిందని అన్నారు.










