May 02,2023 23:00

ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్లలో మంగళవారం భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు గ్రామాల్లో రహదారులు జలమయం అయ్యాయి. కంచికచర్ల-మధిర రహదారి పూర్తిగా ధ్వంసమై కోతకు గురైంది. స్థానిక నెహ్రూ సెంటర్‌ నుండి భావనా ధియేటర్‌ సెంటర్‌ వరకు రోడ్డు పూర్తిగా నాలుగు అడుగుల మేర గోతులు పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మధిర వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి మహిళతో సహా గుంతలో పడ్డాడు. ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణ తటాకంగా మారింది. ప్రజాశక్తి-రెడ్డిగూడెం: గత మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మామిడి, మొక్కజొన్న, దాళ్వా పంట రైతులు బెంబేలెత్తిపోతున్నారు. కోసి రాశులుగా పోసిన ధాన్యం తడిసిపోవడం, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మామిడి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం.మాధవరెడ్డి కోరారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి రైతులు బెంబేలు ఎత్తుతున్నారు. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిర్చి, ధాన్యం తడవకుండా పట్టాలు కప్పి పంటను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఎండకాస్తు అప్పటికప్పుడే మబ్బులు పడుతూ వర్షాలు కురవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ కాసే టైంలో తడిసిన పంటను ఆరబెడుతూ ఉండటం, మబ్బులు పట్టి వర్షం పడే సమయంలో మరలా ఆ పంటను ఒక చోట చేసి పట్టాలు కప్పి తడవకుండా కాపాడుకునే పనిలో ఉన్నారు. అసలే గిట్టుబాటు ధర లేక కౌలుకు తీసుకొని పంట పండిస్తూ పంట చేతి కంది అమ్ముకునే సమయంలో ఇలా అకాల వర్షాలు రావడం దారుణమని, తడిసిన పంటను సైతం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు వాపోతున్నారు. ప్రజాశక్తి-నందిగామ: నందిగామ మండలంలో మంగళవారం చిన్నపాటి చిరుజల్లుకే రోడ్లు బురదమయంగా మారాయి. నందిగామ నుంచి ముప్పాల వెళ్లే రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని 16 వార్డులో కనకదుర్గ గుడి పక్కన ఖాళీ స్థలం చిన్నపాటి వర్షానికి చెరువును తలపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ఏరియాలో గ్రావెల్‌ తో వేయించుకొని మెరక చేసుకున్నారు తప్ప ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో కనీసం చెంచాడు మట్టి కూడా వేయడం లేదని పట్టణ ప్రజలు అధికారులు తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అశోక్‌ నగర్‌లో మార్కెట్‌ యార్డ్‌ వెనకవైపు ఉన్న వీధుల్లో సైతం బురద నీరు పేరుకుపోయి నడవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు మొక్కజొన్న, మిర్చి, వేసంగి, వరి పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . కల్లాలపై ఉన్న మిర్చి పంట తడిసి రంగు మారడంతో మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాలపై పరదా పట్టాలు కప్పినప్పటికీ మిర్చి మొక్కజొన్న తదితరు పంటలు తడిసిపోవడంతో మిర్చి రైతులు ,మొక్కజొన్న రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నందిగామ మండలంలో మొక్కజొన్న పంట సుమారు 200 ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేయడం జరిగింది. మొక్కజొన్న పంట కాపుకు వచ్చి ఆరబెడుతున్న సమయంలోనే అకాల వర్షం వల్ల మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న కింటా మద్దతు ధర 1900 రూపాయల ఉండగా దళారులు 1600 మించి కొనడం లేదు. అకాల వర్షం వల్ల 1400 నుంచి 1500 నుంచి కొనకపోవడం వల్ల మొక్కజొన్న రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నందిగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ లో ఏర్పాటు చేసిన మార్క్‌ పెడ్‌ కేంద్రం అలంకారప్రాయంగానే దర్శనమిస్తుంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మొక్కుబడిగానే పనిచేస్తున్నాయి. ధాన్యం రైతులకు ఇంతవరకు డబ్బులు రాకూడదు దాన్ని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్చి క్వింటా రూ.20 వేలు ఉండగా అకాల వర్షాల వల్ల దళారులు సిండికేట్‌గా మారి క్వింటా మిర్చి పది వేలకు మించి కొనడం లేదని మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ మండలంలో వేసంగి వరి పండించిన రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించిందని పలువురు ధాన్యం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అకాల వర్షం వల్ల తడిసిన పంటలను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు కర్రి వెంకటేశ్వరావు డిమాండ్‌ చేశారు. ప్రజాశక్తి-వత్సవాయి: గత మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మామిడి, మొక్కజొన్న, దాళ్వా పంట, మిర్చి వేసిన రైతులు బెంబేలెత్తిపోతున్నారు. కోసి రాశులుగా పోసిన ధాన్యం తడిసిపోవడం, మామిడి కాయలు రాలిపోవడం, మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చిరుమామిళ్ల హనుమంతరావు కోరారు.