Feb 12,2023 22:08

టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న అబ్దుల్‌ అజీజ్‌

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు రూరల్‌ టిడిపి అభ్యర్థిగా 2024లో అబ్దుల్‌ అజీజ్‌ అభ్యర్థిగా ఉండాలని, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాకొద్దని టిడిపి నెల్లూరు రూరల్‌ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. ఆదివారం టిడిపి జిల్లా కార్యాలయంలో నెల్లూరు రూరల్‌ నియో జకవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు మాట్లాడారు. నెల్లూరు రూరల్‌ ఎంఎల్‌ఎగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టిడిపి కార్యకర్తలను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారన్నారు. అనేక మందిపై దాడులు చేశారని, వ్యాపారాలు దెబ్బ తీయాలని చూశారని, అలాంటి వ్యక్తిని టిడిపిలోకి ఆహ్వ నించవద్దన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్‌బాబు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని పార్టీని కాపాడాలని కోరారు. అజీజ్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే, తాము అసెంబ్లీకి పంపుతామన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు అబ్ధుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ .ప్రజాసేవ చేసే వారిని టిడిపి ఆహ్వానిస్తుందని చంద్రబాబు చెప్పారని, అయితే దుర్మార్గాలు చేసే వారిని, ప్రజలను వేధించేవారిని వ్యాపారస్తులను బెదిరించేవారిని, ప్రాణాలు తీసేవారిని, అధికారులను భయభ్రాంతులకు గురి చేసే వారిని, క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడేవారిని సింగిల్‌ నెంబర్లు ఆడించే వారిని, గంజాయి అమ్మేవారిని, దొంగ కేసులు పెట్టే వారిని తెలుగుదేశం ఆహ్వా నించదన్నారు. ఎవరైనా ఇంట్లో మొక్కలు నాటితే పూల పండ్ల మొక్కలు నాటుకుంటామని, అంతేగానీ గంజాయి మొక్కలు నాటుకోమని, అలాగే గంజాయి మొక్కలను నాటే వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో లేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ విలువలతో, నియమాలతో కూడిన పార్టీ అని, ప్రజలకు సేవ చేయాలని అందరి సామాజిక న్యాయం కల్పించాలన్న ఉద్ధేశ్యంతో వచ్చిన పార్టీ అన్నారు. అందులోకి ఎవరిని పడితే వారిని ఆహ్వానించబోమని తెలిపారు చంద్రబాబు, లోకేష్‌ బాబులు ఎంతో స్పష్టమైన ఆలోచనలతో ఉన్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిన వారిని అక్రమ కేసులు బనాయించిన వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తారన్నారు. రూరల్‌ ప్రజల ఆందోళన, ఆవేదనలో అర్థం ఉందన్నారు. దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందన్నారు. వైసిపి నేతలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారని, ఒకరి పాపాలు ఒకరు చెప్పుకుంటున్నారని, దానిని ఆస్వాదిస్తూ ఉందామని తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేరికపై చంద్రబాబు, లోకేష్‌తో మాట్లాడానని, అసలు ఈ సంభాషణ వారి మదిలో కూడా లేదని, రూరల్‌ నేతలు కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రూరల్‌ టిడిపి నేతలను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని, అక్రమ కేసులు బనాయించారని, ప్రాణాలు తీయబోయారని, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేశారని కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీసేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చంద్రబాబు లోకేష్‌బాబు మర్చిపోలేదని, సమయం కోసం వేచి చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే టిడిపి కార్యకర్తలకు జరిగిన నష్టాలకు ప్రతీకారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, గున్నయ్య, రాజా నాయుడు పెంచల నాయుడు, మేకల నరేంద్ర రెడ్డి, సురేంద్రబాబు, సాబీర్‌ ఖాన్‌, కంటే సాయి, జలదంకి సుధాకర్‌, అసిఫ్‌ పాషా, గంగాధర్‌, మాతంగి కష్ణ, రమేష్‌ చౌదరి, కప్పిర శ్రీనివాసులు, భూ లక్ష్మి, అల్లాబక్షు, శ్రీనివాస్‌ యాదవ్‌, రేవతి, వనజా రెడ్డి, సుబ్బరాజు, జగన్‌, మిర్చి రవి, సికరి భాస్కర్‌, వెంకట రమణా రెడ్డి, శ్రీహరి రెడ్డి పాల్గొన్నారు