రక్తదానం చేస్తున్న దృశ్యం
ఐక్యపోరాటాలకు ట్రేడ్ యూనియన్లు సిద్ధం
-సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత
-ఘనంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావదినోత్సవ కార్యక్రమం
ప్రజాశక్తి-నెల్లూరు:కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకొనేందుకు ట్రేడ్ యూనియన్లు ఐక్యపోరాటాలకు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. శనివారం స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 44 వసంతాలు పూర్తి చేసుకొని 45వ వసంతంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రధాన ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో రక్తదాన శిబిరం, దంత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత ప్రారంభించారు. ముందుగా ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌డబ్ల్యూఎఫ్ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం తన 9 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.ఆర్‌టిసి సంస్థను దివాళా తీసే విధంగా సంస్కరణలను అమలు చేస్తుందన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె జిలానీబాష మాట్లాడుతూ ఆర్‌టిసిని ప్రభుత్వ రంగ సంస్థగా విలీనం చేసుకున్న అనంతరం ఉద్యోగుల సమస్యలు పెరిగాయని, న్యాయంగా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థికపరమైన విషయాలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందన్నారు. ఆర్‌టిసి సంస్థను ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేసుకున్న నాటి నుంచి నేటి వరకు బస్సుల సంఖ్య తగ్గింపోతున్నాయే తప్ప పెరగటం లేదన్నారు. గడిచిన 44 సంవత్సరాల నుంచి ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర డిప్యూటి జనరల్ మేనేజర్ కట్టా సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కృష్ణారావు, ఎ.వి.రామయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్.రాజశేఖర్, ఎ.క్రిష్ణయ్య, జిల్లా మహిళా కన్వీనర్ డి.రాజమ్మ, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సిందూజ, అనిత పలువురు ఆటో కార్మికులు, ఆర్‌టిసి ఉద్యోగులు పాల్గోన్నారు.










