- మోడీ హఠావో, మహిళా బచావో, దేశ్ బచావో పోస్టరు ఆవిష్కరణ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మనువాద భావజాలంతో దేశంలో చిన్నారులు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, హత్యలు, అత్యాచారాలకు అంతే లేదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ హఠావో, మహిళా బచావో, దేశ్ బచావో పేరుతో ఐద్వా రూపొందించిన పోస్టరును బుధవారం వడ్డేశ్వరంలోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. నేరాలు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిందని, మహిళలు, చిన్నారులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని అన్నారు. తక్షణమే జస్టిస్ వర్మా కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ విచారణలు చేయాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ మాటలు నీటిపై రాతలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. 42 శాతం నిరుద్యోగం పెరిగిందని, ఉపాధి లేక వలసలూ పెరిగాయని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు పని భద్రత లేదని, కనీస వేతనం అమలుకావడం లేదని, ఆహార భద్రత అటకెక్కిందని, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర రూ.450 ఉంటే, ప్రస్తుతం రూ.1100 అయ్యిందని, ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.200 తగ్గించినట్లు మోసం చేస్తున్నారని తెలిపారు. మహిళల కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 4.9 శాతం మాత్రమే ఇచ్చారని విమర్శించారు. లక్షల కోట్లు అదానీ, అంబానీలకు ఇస్తున్నారని, మహిళలకు ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఐద్వా ఆధ్వర్యాన చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి, నాయకులు డి శ్రీనివాసకుమారి, జి అమలశ్రీ, టి శ్రీదేవి పాల్గొన్నారు.










