ప్రజాశక్తి కదిరి టౌన్ : ఆహార పంటలలో జన్యు మార్పిడి వలన తీవ్ర ముప్పు వాటిల్లుతుందని సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సురక్షిత ఆహార వారోత్సవాలలో భాగంగా ఆహార పంటలలో జన్యు మార్పిడివల్ల కలిగే ముప్పు అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వినర్ భానుజా మాట్లాడుతూ ఇటీవల జన్యు మార్పిడి ఆవాల పంటకి కేంద్రప్రభుత్యం అనుమతి ఇవ్వడంతో ఆహార పంటలలో జన్యు మార్పిడి ప్రమాదంగా మారనుందన్నారు. జన్యుమార్పిడి పంటల విషయంపై దేశ మంతటా అన్ని వర్గాల ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారన్నారు. జన్యు మార్పిడి పంటల వలన ఆరోగ్యం పర్యావరణం పై పడే ప్రభావాలతో పాటు రైతులు విత్తనాల హక్కులను కోల్పోతారన్నారు. రైతులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో రైతులు రైతు ఉత్పత్తి దారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.










