Feb 13,2023 20:54

ముళ్ల చెట్లతో నిండిపోయిన పెడబల్లి ప్రధాన కాలువ

           నంబులపూలకుంట : సాగునీటిని అందించాల్సిన ప్రధాన కాలువ అధికారుల నిర్లక్ష్యంతో కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. మొత్తం చెట్లతో నిండిపోయ అక్కడ ఓ కాలువ ఉందన్న విషయం కూడా తెలియకుండా ఉంది. నంబులపూలకుంట మండల పరిధిలోని పెడబల్లి గ్రామపంచాయతీ పెడబల్లి ప్రాజెక్టు కింద ప్రధాన కాలువ దాదాపు 12 కిలోమీటర్లు ఉంది. సాగునీటి సరఫరా నిమిత్తం ఈ కాలువను 2008 సంవత్సరంలో పూర్తి చేశారు. దీని కింద పెడపల్లి, గొల్లపల్లి, తండా, బత్తినగారిపల్లితో పాటు పలు గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రధాన కాలువ ద్వారా దాని కింద ఉన్న వేలాది ఎకరాలకు నీరిచ్చి సాగులోకి తేవాలన్న ఉద్ధేశంతో దీనిని నిర్మించారు. కొన్నేళ్లు క్రితం ప్రధాన కాలువ పెడబల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పంటల సాగు నిమిత్తం అందించారు. అప్పట్లో సంవత్సరానికి మూడు పంటలను రైతులు పండించారు. రానురానూ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఈ కాలువ కంపచెట్లతో మూసుకుపోయింది. ప్రస్తుతం గొల్లపల్లి, బత్తినిగారిపల్లి గ్రామాల పరిధిలో కాలువ మొత్తం కంపచెట్లతో నిండిపోయింది. ఈ చెట్లతో కాలువ అడవిని తలపిస్తోంది. పెద్దపెద్ద రాళ్లు కాలువ నిండా చేరాయి. రైతుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలతో నిర్మించిన కాలువ పరిరక్షణపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాలువ ఏర్పాటు సమయంలో వందలాది ఎకరాల సాగు భూమిని రైతులు కోల్పోయారు. కాలువ ఏర్పాటు అయితే భూములు సాగులోకి వస్తాయన్న ఉద్ధేశంతో రైతులు అతి తక్కువ నష్టపరిహారం తీసుకుని వారి భూములను ఇచ్చేశారు. తీరా కాలువ పూర్తయ్యాక సాగు నీరు సరఫరా చేయకపోగా, అందులో కంపచెట్లు పెరిగి వృథాగా మారింది. దీంతో రైతులు చేసిన త్యాగం వృథా అయ్యింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నంబులపూలకుంట పరిధిలోని పెడబల్లి ప్రాజెక్టు ప్రధాన కాలువలోని మొక్కలను తొలగించి, దాని ద్వారా సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
మరమ్మతులు చేయిస్తాం
రామంజులనాయక్‌, ఇరిగేషన్‌ ఎఇ.

పెడబల్లి ప్రాజెక్టు కింద ప్రధాన కాలువలో కంపచెట్లు పెరిగాయి. త్వరలో కాలవను పరిశీలించి మరమ్మతు చర్యలు చేపడతాం. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. పంటల పండించడానికి సాగునీరు అవసరమని రైతులు కోరితే తప్పనిసరిగా సాగునీటిని ఈ కాలువ ద్వారా అందిస్తాం.