కడప అర్బన్ : పశుసంవర్ధక శాఖ పాలి క్లినిక్ ఉపసంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ సి.అచ్చెన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అఖిల పక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డ కడపలోని జిల్లా పశు సంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న దళిత ఉద్యోగి అచ్చెన్న అనుమానాస్పద స్థితిలో మతి చెందాడని పేర్కొన్నారు. 13 రోజుల కిందట అదశ్యమైన అచ్చెన్న శుక్రవారం అన్నమయ్య జిల్లాలో శవమై కనిపించాడని తెలిపారు. డిడి మతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పారు. పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందికి, అచ్చెన్నకు శాఖాపరమైన సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో తన తండ్రి ఈనెల 12 నుంచి కన్పించడం లేదని మృతుని కుమారుడు క్లింటన్ చక్రవర్తి ఈ నెల 14న కడప వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల స్పందించలేదన్నారు. అదశ్యమైన అచ్చెన్న ఈనెల 24న శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ హత్య అని ఆరోపించారు. పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్నకు ఏడీలు శ్రీధర్ లింగారెడ్డి, సుధీర్ నాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోస్ శాఖపరంగా సహకరించకపోగా, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, వివక్షత చూపుతూ, మానసికంగా వేదించేవారని చెప్పారు. ఉన్నత అధికార యంత్రాంగం దష్టికి తీసుకుపోయినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఓ దళిత అధికారి ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాల ఆవరణలోనే పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టరు కార్యాలయం ఉందని, ఇక్కడ డీడీలు, ఇతర అధికారుల మధ్య దాదాపు ఎనిమిది నెలలుగా వివాదం జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై శాఖ అధికారులు ఒకరిపై మరొకరు కలెక్టర్, ఎస్‌పికి ఫిర్యాదు చేసుకుంటున్నా జిల్లా యంత్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాపోయారు. డిడి అచ్చన్న తన కింది స్థాయి అధికారుల వైఖరిపై శాఖపరంగా సరెండర్ చేసినప్పటికీ, ప్రభుత్వం తిరిగి అదే స్థానాలలో విధులు నిర్వహించే విధంగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, డీడీ అచ్చెన్నను సస్పెండ్ చేస్తూ ఆ స్థానంలో జెడి శారదమ్మకు ఉన్నతాధికారులు అదనపు బాధ్యత ఇవ్వడం ప్రభుత్వం అగ్రవర్ణ దురహంకారం బయటపడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దళిత, బడుగు, బలహీన వర్గాలపై హింసను ప్రేరేపిస్తోందన్నారు. ఇటీవల కాలంలో దళిత డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వ వేధింపులకు తాళలేక గుండెపోటుతో మరణించిన ఘటన మరవకముందే పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న డాక్టర్ సి. అచ్చన్న మరణం తీరని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అచ్చెన మతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి. చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, బిసి మహాసభ నాయకులు అవ్వారు మల్లికార్జున, బిఎస్‌పి గురప్ప, ఆప్ నేత డాక్టర్ శ్రీనివాసులు, లోక్సత్తా కష్ణ, జనసేన గౌస్ బాషా, హేతువాద సంఘం సి.ఆర్.వి. ప్రసాద్‌రావు, ఎంఆర్‌ఎఫ్ నాయకులు దస్తగిరి, ఎఐటియుసి నాగ సుబ్బారెడ్డి, వేణుగోపాల్, బాదుల్లా, పి. చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుబ్రమణ్యం, డి హెచ్ పి ఎస్ మునయ్య, సావంత్ సుధాకర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్, దస్తగిరి రెడ్డి, ఇన్సాఫ్ మైనుద్దీన్, హుస్సేన్, పకీరప్ప పాల్గొన్నారు.










